Ind Vs HK: కోహ్లికి హాంగ్‌ కాంగ్‌ జట్టు స్పెషల్‌ గిఫ్ట్‌.. థాంక్యూ విరాట్‌ అంటూ! ఫిదా అయిన ‘కింగ్‌’!

Asia Cup 2022: Virat Kohli Gets Emotional By Hong Kong Team Gesture - Sakshi

విరాట్‌.. ఓ తరానికి స్ఫూర్తిదాతగా నిలిచినందుకు ధన్యవాదాలు!

Asia Cup 2022- India vs Hong Kong- Virat Kohli: సమకాలీన క్రికెటర్లలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలితో అనేకానేక అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌. అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు నమోదు చేసి.. పరుగుల యంత్రంగా పేరుగాంచాడు. బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసి టీమిండియా ముఖ చిత్రంగా మారిన కోహ్లి ఆటకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ఫిదా అవ్వాల్సిందే!

చాలా రోజుల తర్వాత..
కానీ, గత కొన్నిరోజులుగా కోహ్లి తన స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శల పాలైన విషయం తెలిసిందే. కనీసం అర్ధ శతకం కూడా నమోదు చేయలేక విమర్శకుల నోటికి పనిచెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు కోహ్లి. పసికూనే అయినా హాంగ్‌ కాంగ్‌ బౌలర్లు.. భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(36), రోహిత్‌ శర్మ(21)ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. 

ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 59 పరుగులు నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(26 బంతుల్లో 68 నాటౌట్‌) అర్ధ శతకాలతో మెరిసి టీమిండియా భారీ స్కోరు చేయడంలో.. తద్వారా హాంగ్‌ కాంగ్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.


PC: Virat Kohli

థాంక్యూ కోహ్లి.. మీకు కూడా ధన్యవాదాలు
ఇదిలా ఉంటే కోహ్లి ఇలా తిరిగి ఫామ్‌లోకి రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. తమ అభిమాన ఆటగాడు కోహ్లి పట్ల ప్రేమను చాటుకుంది హాంగ్‌ కాంగ్‌ జట్టు. ‘‘విరాట్‌.. ఓ తరానికి స్ఫూర్తిదాతగా నిలిచినందుకు ధన్యవాదాలు. 

మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాము. నీకు మద్దతుగా నిలుస్తాము. రాబోయే రోజుల్లో నువ్వు మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాలి. ప్రేమతో.. టీమ్‌ హాంగ్‌ కాంగ్‌’’ అంటూ తమ జెర్సీపై రాసి కోహ్లికి పంపింది. ఇందుకు స్పందించిన కోహ్లి.. ‘‘మీ ఆత్మీయతకు ధన్యవాదాలు. వెరీ వెరీ స్వీట్‌’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు.

ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ.. సొంత జట్టుతో పాటు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, పాకిస్తాన్‌ సారథి బాబర్‌ ఆజం తదితర విదేశీ క్రికెటర్లు కూడా అతడికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

చదవండి: Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్‌ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్‌ ఫిదా! తలవంచి మరీ! వైరల్‌
Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్‌ కోహ్లి బౌలింగ్‌.. అభిమానులు ఫిదా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top