బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్‌ బయటపడ్డాడు.. లేకపోతే..?

Ashwin Was Kept Away From Cricket To Avoid Being Banned By ICC Says Saeed Ajmal - Sakshi

కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు బీసీసీఐపై పలు ఆరోపణలు చేశాడు. అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన అశ్విన్‌ను బీసీసీఐ కాపాడిందని, లేకపోతే అతనిపై నిషేధం పడేదని వెల్లడించాడు. ఐసీసీకి యాష్‌పై అనుమానం కలిగినప్పుడు బీసీసీఐ అతన్ని కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచిందని, ఆ సమయంలో యాష్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌ను సరిచేసుకున్నాడని ఆరోపణలు గుప్పించాడు. కాగా, స్పిన్‌ బౌలర్‌ భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనంటూ ఐసీసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో అజ్మల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్‌ మాట్లాడుతూ.. 

బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్‌ నిషేధం బారిన పడకుండా బయటపడ్డాడని, అయితే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)లో ఇలాంటి పరిస్థితి ఉండదని, వారికి తమ ఆటగాళ్ల భవిష్యత్తు కంటే డబ్బే ముఖ్యమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అజ్మల్‌ ఐసీసీపై కూడా పలు ఆరోపణలు గుప్పించాడు. ఐసీసీ.. ఒక్క బీసీసీఐ సలహాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని నిబంధనలను మారుస్తుందని, ఎంతటి కఠిన నిబంధనలైనా భారత్‌కు వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నాడు. కాగా, అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన కారణంగా అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కుడి చేతి ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అజ్మల్‌ పాక్‌ తరఫున 2008-15 మధ్యలో 35 టెస్ట్‌లు, 113 వన్డేలు, 64 టీ20లు ఆడి మొత్తంగా 447 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్‌ బౌలర్‌ అశ్విన్‌ 78 టెస్ట్‌లు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడి మొత్తంగా 611 వికెట్లు సాధించాడు. 
చదవండి: అసభ్య పదజాలంతో రైనా టీషర్ట్‌, చీవాట్లు పెట్టిన ద్రవిడ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top