
న్యూఢిల్లీ: అసభ్య పదజాలంతో ఉన్న టీ షర్ట్ ధరించినందుకు నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనకు చివాట్లు పెట్టాడని టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కీలక సభ్యుడు సురేశ్ రైనా గుర్తు చేసుకున్నాడు. తన ఆత్మ కథ 'బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మి'లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు హుందాగా వ్యవహరించాలని ద్రవిడ్ తనకు క్లాస్ పీకినట్లు రైనా వెల్లడించాడు. తాను ధరించిన టీ షర్ట్‌పై 'FCUK' అన్న పదం రాసుందని, దాన్ని చూడగానే ద్రవిడ్ కోపడ్డాడని పేర్కొన్నాడు. అయితే ద్రవిడ్ హెచ్చరించగానే ఆ టీ షర్ట్‌ను చెత్తబుట్టలో పడేసి మరొకటి ధరించానని రైనా తన ఆత్మ కథలో రాసుకున్నాడు.
ద్రవిడ్ సారధ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా.. 2006 మలేషియా పర్యటనలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తన ఆత్మకథలో ప్రస్తావించాడు. అయితే ఈ విషయంలో ద్రవిడ్ స్పందించిన తీరు తనను బాగా కదిలించిందని, అప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. భారత క్రికెటర్లు హందాగా ఉండాలన్నదే ద్రవిడ్ ఉద్దేశమని, మన వేషధారణ బట్టే మన దేశాన్ని గౌరవిస్తారని ద్రవిడ్ చెప్పిన మాటలు ఎప్పటికీ తనను అలర్ట్ చేస్తుంటాయని పేర్కొన్నాడు. అయితే ఎప్పుడూ రిజర్వ్‌డ్‌గా ఉండే ద్రవిడ్‌ను నవ్వుతూ చూడాలన్నదే తన కోరికని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి భారత ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. ఇక, గతేడాది ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
చదవండి: WTC Final: విజేతకు భారీ ప్రైజ్‌మనీ