Hanuma Vihari Controversy: క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌

Andhra Cricket Association Responds On Hanuma Vihari Row - Sakshi

క్రికెట్ అనేది  జెంటిల్మెన్ గేమ్. క్రికెట్‌ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఇందుకు విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్‌ ముందుకు సాగుతోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావులేదు. 

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌పై ఇలాంటి ఆరోపణలు విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్‌మెంట్‌ మీద ఉన్న ప్రధాన బాధ్యత. 

ఆ బాధ్యతలో భాగంగా ఏ ఆటగాడైనా తొందరపడ్డా, లేక మరో రకంగా ప్రవర్తించినా వారి విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించి జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావడానికి మేనేజ్‌మెంట్‌ నిరంతరం ప్రయత్నిస్తుంది. 

జట్టు ప్రయోజనాలను, క్రికెట్‌ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లోలోపలే వాటిని సర్దుబాటు చేయడానికి యత్నిస్తుంది. పరిధి దాటినప్పుడు నిర్దేశిత నియమావళి, పద్ధతులు ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది.

సీనియర్‌ ఆటగాడు హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా  ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌పైనా, తోటి ఆటగాళ్లపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్ని రాజకీయ పక్షాల నాయకులు వాటిని ఆసరాగా తీసుకుని అసోసియేషన్‌ నాయకత్వంపైనా, మేనేజ్‌మెంట్‌పైనా ఆరోపణలు చేశాయి.  ఈ నేపథ్యంలో అసోసియేషన్‌ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వాస్తవ అంశాలను తెలియజేస్తున్నాం. 

హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్‌ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. 

హనుమ విహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్‌వోసీ  ఇవ్వకపోవడంతో భారత జట్టుకు ఎంపిక కాకపోవడం పట్ల తాను ఫ్రస్టేషన్‌లో ఎమోషన్‌కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను కోరాడు.  

జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్‌మెంట్‌ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top