న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమేలియా కెర్ అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అమేలియా కెర్ వరుసగా పదోసారి 30కి పైగా పరుగులు సాధించడం విశేషం. సౌతాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా అమేలియా ఈ ప్రపంచ రికార్డును అందుకుంది.
ఈ నేపథ్యంలోనే పురుషుల,మహిళల క్రికెట్‌లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కూడా అమేలియా కెర్ తాజాగా తన పేరిట లిఖించుకుంది. గతంలో అమేలియా కెర్ సహా శ్రీలంకకు చెందిన చమేరి ఆటపట్టు, రోమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్‌లు 9 సార్లు వరుసగా 30కి పైగా స్కోర్లు సాధించారు.
తాజాగా వీరిని వెనక్కినెట్టిన అమేలియా కెర్ అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్‌లో రోహిత్ శర్మ (భారత్), అభిషేక్ శర్మ (భారత్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), హ్రిస్టో లాకోవ్‌లు వరుసగా ఏడుసార్లు 30కి పైగా స్కోర్లు సాధించారు. ఇదే మ్యాచ్‌లో మరో కివీస్ బ్యాటర్ సోఫీ డివైన్ కూడా అరుదైన రికార్డు సాధించింది.
మ్యాచ్‌లో 34 బంతుల్లో 64 పరుగులు చేసిన సోఫీ డివైన్.. దక్షిణాఫ్రికా జట్టుపై 10సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. గతంలో బాబర్ ఆజమ్ (వర్సెస్ న్యూజిలాండ్), స్మృతి మంధాన (వర్సెస్ ఇంగ్లండ్), బెత్ మూనీ (వర్సెస్ భారత్) తొమ్మిదేసి సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం కివీస్ మహిళలు 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జెస్ కెర్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నామమాత్రమైన ఐదో టీ20 బుధవారం జరగనుంది.


