
PC: BCCI
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుకుంటోందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పదేళ్లకు పైగా భారత క్రికెట్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపానని.. అలాంటి తన పట్ల అసోసియేషన్ ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డాడు.
కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్
కాగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నార్త్ స్టాండ్ (North Stand) పేరుకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు ఉండగా... ఇప్పుడు అతడి పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ (రిటైర్డ్) వి.ఈశ్వరయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా.. ఈ స్టాండ్‌కు సంబంధించి ఇకపై స్టేడియం అధికారిక కార్యక్రమాల్లో గానీ టికెట్లపై గానీ అజహర్ పేరును వాడరాదని ఆయన హెచ్‌సీఏకు సూచించారు. కాగా భారత క్రికెటర్‌గా, కెప్టెన్ అజహర్ చేసిన సేవలను గుర్తిస్తూ 2019లో ఈ స్టాండ్‌కు అతడిపేరు పెట్టారు.
అయితే ఆ సమయంలో స్వయంగా అజహర్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ హోదాలో తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) కిందకు వస్తుందని.. పైగా జనరల్ బాడీ అనుమతి లేకుండానే ఇది చేశారంటూ లార్డ్స్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ అనంతరం అంబుడ్స్‌మన్ ఈ మేరకు తన తీర్పును వెలువరించారు.
మీ ముఖం మీదే నవ్వుతారు
తాజాగా ఈ విషయంపై మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ‘ది హిందూ’తో మాట్లాడుతూ.. ‘‘ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశానికి ఆస్కారమే లేదు. ఈ విషయమై నేను ప్రస్తుతం ఎలాంటి కామెంట్ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను..
క్రికెట్ ప్రపంచం హెచ్‌సీఏ ముఖం మీదే నవ్వుతుంది. వారి తీరు అలా ఉంది మరి!.. పదిహేడేళ్ల క్రికెట్ కెరీర్.. పదేళ్లకు పైగా జాతీయ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాను. హైదరాబాద్‌లో క్రికెటర్ల పట్ల ఇదిగో.. ఇలాగే వ్యవహరిస్తారు. ఇది చాలా విచారకరం. మేము కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అజారుద్దీన్ తెలిపాడు.
మరోవైపు... నార్త్ స్టాండ్ పేరుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ది లార్డ్స్ క్రికెట్ క్లబ్ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ‘‘నిబద్ధత, నిష్పాక్షితకు ఈ తీర్పు నిదర్శనం. పారదర్శకంగా వ్యవహరించిన అధికారులకు మా ధన్యవాదాలు’’ అని క్లబ్ కోశాధికారి సోమ్నా మిశ్రా ‘ది హిందూ’తో వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ కెరీర్ ఇలా
కాగా హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అజారుద్దీన్ 1984- 2000 సంవత్సరం మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 99 టెస్టులాడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 6215 పరుగులు సాధించాడు. ఇందులో 22 శతకాలు ఉన్నాయి.
అదే విధంగా.. టీమిండియా తరఫున 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్.. ఏడు సెంచరీల సాయంతో 9378 పరుగులు సాధించాడు. రైటార్మ్ మీడియం పేసర్ అయిన అతడు.. వన్డేల్లో 12 వికెట్లు కూడా తీశాడు.
చదవండి: అశుతోష్ శర్మపై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్! కారణం ఇదే..