చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ మహరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్.. 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.
తన అద్భుత స్పెల్‌తో చెన్నై టాపార్డర్‌ను ఆకాశ్ సింగ్ కుదేలు చేశాడు. ఓపెనర్లు సంజూ శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (13).. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (6)ను పెవిలియన్‌కు పంపి చెన్నైని నామమాత్రపు స్కోరు (187)కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
క్రీడా వర్గాల్లో చర్చ
అయితే, కీలక వికెట్లు తీసిన సంతోషంలో ఆకాశ్ సింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘‘అక్కీ ఆన్ ఫైర్.. టీ20 మ్యాచ్‌లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’’ అని రాసి ఉన్న నోట్ చూపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అప్పటి నుంచి..
ఈ నేపథ్యంలో ఆకాశ్ సింగ్ చర్యపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘పేపర్ ట్రెండ్’ మానుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. ‘‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’’ అంటూ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అభిమానులకు అంకితమిస్తూ నోట్ చూపించాడు.
అప్పటి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ సైతం ఇదే తరహాలో నోట్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఉర్విల్ పటేల్ సైతం.. ‘‘ఈ ఇన్నింగ్స్ నీకోసమే నాన్నా’’ అని రాసి ఉన్న పేపర్ చూపించాడు. తాజాగా ఆకాశ్ ఇదే పనిచేశాడు.
నిజం చెప్పాలంటే
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఈ పేపర్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇకపై ఇదేమీ ట్రెండ్ కాబోదు. నిజం చెప్పాలంటే గతంలోనూ దీనిని ట్రెండ్‌గానూ ఎవరూ గుర్తించలేదు’’ అని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఇక భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడి అభివ్యక్తి అది. అయితే, చాలా మందికి ఇది నచ్చలేదు. ఇదొక రకంగా సరదాగా.. అదే సమయంలో చెత్తగా ఉంది.
ఇదంతా నాన్‌సెన్స్
ఈ చిట్టీల బిజినెస్‌ను నిషేధించాలి. ఇదంతా నాన్‌సెన్స్. వాళ్లు మైదానంలోకి ఇలా చిట్టీలు తీసుకురావడం నాకైతే నచ్చడం లేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. విమర్శలపై ఆకాశ్ సింగ్ స్పందించాడు.
‘‘నాకు ఇలా చేయడం స్ఫూర్తినిస్తుంది. అంతే తప్ప మైదానంలోకి నోట్ తీసుకురావడంలో వేరే ఉద్దేశం లేదు. మ్యాచ్ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చే వాటిని నేను వదిలేయలేను’’ అని ఆకాశ్ సింగ్ పేర్కొన్నాడు.


