Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్‌

Aditya Tare Leave Mumbai After-17-Years Join Uttarakhand 2022-23 Season - Sakshi

రంజీ సీనియర్‌ ఆటగాడు.. 34 ఏళ్ల ఆదిత్య తారే ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌తో ఉన్న 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికాడు. వచ్చే సీజన్‌ నుంచి ఆదిత్య తారే ఉత్తరాఖండ్‌ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. వచ్చే డొమొస్టిక్‌ సీజన్‌ కోసం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించిన 47 మంది సీనియర్‌ క్రికెటర్ల లిస్టులో ఆదిత్య తారే పేరు కనిపించలేదు. దీంతో ముంబైతో  తారే బంధం ముగిసిందని  వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తారే స్వయంగా స్పందించాడు. ''ముంబై జట్టుతో ఉన్న నా 17 ఏళ్ల బంధం నేటితో ముగిసింది. ముంబై నుంచి విడిపోతున్నా అనే పదం చెప్పడం నాకు బాధను కలిగిస్తోంది. అది ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు. 16 ఏళ్ల వయసులో అండర్‌-17 విభాగంలో ముంబైకి తొలిసారి ప్రాతినిధ్యం వహించాను. అప్పటినుంచి దాదాపు 17 ఏళ్ల పాటు ముంబై తరపున అన్ని దేశవాలీ టోర్నీల్లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఈ మార్గంలో నేను కొన్నిసార్లు విజయాలు అందుకున్నా. అలాగే విమర్శలతో పాటు వైఫల్యాలను కూడా సహించాను.

విజయాలైనా, ఓటములైనా మ్యాచ్‌ వరకు మాత్రమే. ఈ 17 ఏళ్లలో నా సహచరులతో గడిపిన క్షణాలు నాకు మంచి జ్ఞాపకాలు. నేను ఎక్కువగా మిస్ అయ్యే విషయం ముంబై డ్రెస్సింగ్ రూమ్. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం..  కొందరు అద్భుతమైన ఆటగాళ్లను చూశాను. అలాగే ముంబై తరపున ఆడుతూ సహచరుల అభినందనలు పొందడం ఎన్నటికి మరిచిపోను'' అంటూ తారే భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.

ఇక  ఆదిత్య తారే ముంబై తరపున 80 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 73 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2015-16 రంజీ సీజన్‌లో ఆదిత్య తారే నేతృత్వంలోని ముంబై జట్టు రికార్డు స్థాయిలో 41వ సారి రంజీ టైటిల్‌ను అందుకోవడం విశేషం. ఇక ఐపీఎల్‌లోనూ ఎక్కువ శాతం ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఆదిత్య తారే 35 మ్యాచ్‌ల్లో 339 పరుగులు సాధించాడు.

చదవండి: IND Vs PAK Asia Cup 2022: ఫీల్డింగ్‌ పరిమితుల గొడవేంటి.. ఐసీసీ కొత్త రూల్స్‌ ఏంటంటే!

 రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top