రైనా, రాయుడు లోటు స్పష్టంగా తెలుస్తుంది

Absence Of Suresh Raina And Rayudu Became Difficult To CSK - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై జట్టు వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చెన్నై ఓపెనర్లు విఫలమైన వేళ మిడిలార్డర్‌లో డుప్లెసిస్‌కు సరైన సహకారం అందకపోవడం.. అంబటి రాయుడు, సురేశ్‌ రైనాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయమై చెన్నై ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ మ్యాచ్‌ అనంతరం స్పందించాడు.

'చెన్నై జట్టు వరుసగా రెండో మ్యాచ్‌ ఓడిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రైనా, రాయుడు లాంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ లైనఫ్‌లో వారి స్థానాలను భర్తీ చేసేందుకు వివిధ రకాల కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాం. కేదార్‌ జాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్యామ్‌ కర్జన్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా మ్యాచ్‌లను కోల్పోతున్నాం. నిజంగా రైనా టోర్నీకి దూరమవ్వడం బాధాకరం.. అతను నిన్నటి మ్యాచ్‌లో ఆడి ఉంటే జట్టుకు గెలిచే అవకాశాలు ఉండేవేమో. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌లో చేదించాల్సిన టార్గెట్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడికి తట్టుకొని నిలకడగా ఆడుతూ బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు. (చదవండి : ధోని వ్యవహరిస్తున్న తీరు సరైనదే)

'ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. మా జట్టు స్పిన్‌ విభాగం మరింత బలహీనంగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్‌లు(రాజస్తాన్‌, ఢిల్లీ) చూసుకుంటే పియూష్‌ చావ్లా, రవీంద్ర జడేజా.. పరుగులు నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు.. చెన్నై జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లు మూడు గ్రౌండ్స్‌లో ఆడింది. పిచ్‌ పరిస్థితులకు తగ్గట్టు ఏ విధమైన బౌలింగ్‌ శైలి నడుస్తుందన్నది చెప్పడం కష్టమైంది. ఐపీఎల్‌ మొదలైన వారం రోజుల్లో మూడు వేదికలపైన అవగాహన వచ్చింది. ఇక ముందు పిచ్‌ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. పేస్‌ బౌలింగ్‌లో కూడా ఒక అంచనాకు వచ్చాం. రానున్న మ్యాచ్‌ల్లో వీటిపై దృష్టి సారిస్తూ.. తప్పులను సరిచేసుకుంటాం. 'అంటూ తెలిపాడు. (చదవండి : ఢిల్లీ కమాల్‌...)

ఇక రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అప్పటికే దాదాపు ఓటమి ఖరారైపోయింది. 24 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని దాటిగా ఏం ఆడలేకపోయాడు. 12 బంతుల్లో 15 పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ మరింత పటిష్టం కావాల్సి ఉంది. రాయుడు తిరిగి జట్టులోకి వస్తేనే టాప్‌ ఆర్డర్‌ బలంగా మారే అవకాశం ఉంది. ఇక వరుసగా రెండు ఓటమిలు చవిచూసిన చెన్నై తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 2న సన్‌రైజర్స్‌తో ఆడాల్సి ఉంది. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 6రోజులు విరామం దొరకడంతో చెన్నైకి రీచార్జ్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top