84 పరుగులకే చాప చుట్టేసిన కేకేఆర్‌

85 Runs Target For RCB Against KKR  - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీతో జరగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ పూర్తిగా తేలిపోయింది. 1,1, 0, 10, 4 ఇవి కేకేఆర్‌ టాప్‌ 5 బ్యాట్స్‌మెన్‌ చేసిన పరుగులు. అసలు ఆడుతుంది టీ20నా లేక గల్లీ క్రికెట్‌ అనేంతలా సాగింది కేకేఆర్‌ బ్యాటింగ్‌ తీరు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచకున్న కేకేఆర్‌.. ఆర్‌సీబీ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 30 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో జట్టు స్కోరు 60 పరుగులు దాటుటుందా అన్న దశలో చివర్లో లోకీ పెర్గ్యూసన్‌ 19 పరుగులు, కుల్దీప్‌ యాదవ్‌ 12 పరుగులు చేయడంతో 84 పరుగులు చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 3వికెట్లు, చహల్‌ 2, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైనీ తలా ఒక వికెట్‌ తీశారు.

సిరాజ్‌ అద్భుత స్పెల్‌ :
4-2-8-3.. ఇవి ఆర్‌సీబీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గణాంకాలు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఇలాంటి గణాంకాలు అరుదుగా చూస్తుంటాం. మొదటిస్పెల్‌లో సిరాజ్‌ వేసిన మూడు ఓవర్లలో తొలి రెండు ఓవర్లు మెయిడెన్‌ వేయడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలో ఒక బౌలర్‌ ఇలా వరుస రెండు ఓవర్లను మెయిడెన్‌గా వేయడం ఇదే తొలిసారి. సిరాజ్‌ ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

కేకేఆర్‌ రెండో అత్యల్ప స్కోరు :
ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.ఇంతకముందు 2008 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15.2 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్‌ అయింది. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత తాజాగా ఆర్‌సీబీపై రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కాగా ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు ఆర్‌సీబీ పేరిట ఉంది. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 49 పరుగులకే చాప చుట్టేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో ఎక్కువసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ ఉన్నాయి. ఇరు జట్లు ఐదేసి సార్లు ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్లు నమోదు చేయడం విశేషం.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top