WI vs ENG: పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు

10 Years Wait Windies Cricketer Nkrumah Bonner Nine-Hour Epic Century - Sakshi

పదేళ్ల క్రితం జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. రెండు, మూడేళ్లలో సదరు క్రికెటర్‌కు గుర్తింపైనా వచ్చుండాలి.. లేదంటే జట్టులోకి వస్తూ.. పోవడం జరిగి ఉండాలి.  మ్యాచ్‌లు ఎక్కువ ఆడితే సూపర్‌ స్టార్‌ అవడం.. లేదంటే కనుమరుగవడం జరుగుతుంది. కానీ పదేళ్ల క్రితమే జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ మధ్యలో ఒక్క మ్యాచ్‌ ఆడకుండా.. తాజా రీఎంట్రీలో సెంచరీతో మెరిసిన క్రికెటర్లు అరుదుగా ఉంటారు.  ఆ కోవకు చెందినవాడే వెస్టిండీస్‌ క్రికెటర్‌ న్క్రుమా బోనర్.

బోనర్‌ వెస్టిండీస్‌ తరపున 2011లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌కు బోనర్‌ను బోర్డు ఎంపిక చేసింది. ఆ సిరీస్‌లో ఒక మ్యాచ్‌ ఆడిన బోనర్‌ మూడు పరుగులు మాత్రమే చేసి.. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఆరు నెలలకు గాని మళ్లీ తలుపు తట్టలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో 30 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అంతే మళ్లీ అప్పటినుంచి పదేళ్ల పాటు విండీస్‌ తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ పదేళ్ల గ్యాప్‌లో అతనికి బోర్డు నుంచి ఒక్కసారి పిలుపు రాలేదు.

ఇక కెరీర్‌ ముగిసినట్లే అని భావిస్తున్న దశలో 2019లో జమైకా జట్టుకు ఎంపికయ్యాడు. బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కరోనా గ్యాప్‌ వల్ల రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్‌ 2020లో బంగ్లాదేశ్‌తో  సిరీస్‌కు బోనర్‌ను ఎంపిక చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన బోనర్‌.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 395 పరుగులు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన విండీస్‌ను కైల్‌ మేయర్స్‌(245 నాటౌట్‌) సూపర్‌ డబుల్‌సెంచరీతో గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో బోనర్‌ 85 పరుగులతో మేయర్స్‌కు అండగా నిలబడ్డాడు. ఒక రకంగా బోనర్‌ కెరీర్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌.

ఆ తర్వాత ఆగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన ఒక టెస్టులో వెస్టిండీస్‌ ఒక్క వికెట్‌ తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ బోనర్‌ కీలకపాత్ర పోషించాడు. తాజగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బోనర్‌ 123 పరుగులతో కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. దాదాపు తొమ్మిది గంటలపాటు ఓపికగా ఆడిన బోనర్‌ 355 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 123 పరుగులు సాధించాడు. అతని కళాత్మక ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలా పదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చి తాజాగా సెంచరీతో వెలుగులోకి వచ్చిన అరుదైన క్రికెటర్ల జాబితాలో బోనర్‌ చేరిపోయాడు.ఇక తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ 157 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్‌లు తయారు చేయకండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top