మళ్లీ అదే నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే నిర్లక్ష్యం

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

పది రోజులుగా మార్కెట్‌లోనే

రైతుల పడిగాపులు

విసిగి వేసారి మిల్లులకు ధాన్యం తరలింపు

రవాణ భారం పడినా మిల్లులకే మొగ్గు

మార్కెట్‌, మిల్లు ధరల్లో తేడా లేదు

ధాన్యాన్ని మార్కెట్‌లో లేదా మిల్లులో అమ్మినా ధరలో పెద్దగా వ్యత్యాసం లేదు. మార్కెట్లో పది రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబెట్టినా కొనుగోళ్లు చేయడం లేదు. అందుకే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నాం. రోజుల తరబడి మార్కెట్‌లో ఉండే కంటే సకాలంలో మిల్లులకు అమ్ముకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

–కేడిక శ్రీనివాస్‌ రెడ్డి, పోతారం (ఎస్‌)

పది రోజుల నుంచి పడిగాపులు

మార్కెట్‌కు ధాన్యం తెచ్చి పది రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఒక్క అధికారి కూడా మా వద్దకు వచ్చి పలకరించలేదు. మిల్లుల కేటాయింపు జరగలేదని సమాధానం చెబుతున్నారు. ఎన్ని రోజులని మార్కెట్‌లో ఉండాలి. –కత్తుల రాధ, పోతారం(ఎస్‌)

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర పొందేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వచ్చి పది రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు విసిగి వేసారిపోతున్నారు. దీంతో రైతులు ఉన్నపళంగా ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేస్తున్నారు.

– హుస్నాబాద్‌

హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అక్టోబర్‌ 26న మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మిల్లర్ల కేటాయింపు చేయలేదు. బార్‌దన్‌ సంచులు అందుబాటులో లేవు. దాదాపు 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. రైతులు దాదాపు పది రోజుల నుంచి మార్కెట్‌లో ధాన్యం ఆరబెట్టుకుంటూ కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు తేమ శాతం ఎక్కువ రావడంతో ధాన్యాన్ని నేర్పుకుంటూ ఆరబెట్టుకుంటున్నారు. సాయంత్రం 6 దాటిందంటే మళ్లీ తేమ శాతం పెరగడం నిత్యకృత్యంగా మారుతుంది. మధ్యాహ్న సమయంలో తేమ శాతం తగ్గడం, రాత్రి అయిందంటే తేమ శాతం పెరుగుతున్న పరిస్థితి. రాత్రింబవళ్లు ధాన్యానికి కాపలాకాస్తున్న రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

మిల్లులకే మొగ్గు..

పది రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ ఎప్పుడు కొనుగోలు చేస్తారో, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తున్న రైతులు విసిగిపోతున్నారు. మార్కెట్‌లో ధాన్యం క్వింటాల్‌కు రూ.2,460, మిల్లుల్లో రూ.10ల తేడాతో రూ.2,450 కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ధాన్యాన్ని పట్టడం, తరుగు, హమాలీ ఖర్చు ఉంటోంది. అదే మిల్లులో హమాలీ ఖర్చు తక్కువగా ఉంటూ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుండటంతో రైతులు మిల్లులకే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలంటే నిబంధనలు పెడుతున్నారు. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదని అంగీకార పత్రాలు రాయించుకుని అనుమతి ఇస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో వర్షం వస్తే రైతులనే బాధ్యులను చేయడం, మార్కెట్‌లో ఇన్ని నిబంధనలు పెట్టినా ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితులు ఉండటంతో మిల్లులోనే అమ్ముకోవడమే మంచిదనే అభిప్రాయానికి రైతులు వచ్చేశారు. దీంతో మార్కెట్‌లో ఆరబెట్టిన ధాన్యాన్ని జేసీబీ సహాయంతో ట్రాక్టర్లలో ఎత్తిపోసి మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడ రైతులకు అదన భారం పడుతున్నా సరే మిల్లులకే అమ్మేందుకు సిద్ధపడుతుండటంతో మార్కెట్‌ ఖాళీ అవుతోంది. ఒక ట్రాక్టర్‌లో ధాన్యాన్ని జేసీబీ ద్వారా ఎత్తిపోస్తే రూ.500, ధాన్యాన్ని మిల్లు వరకు తీసుకెళ్తే ఒక ట్రాక్టర్‌కు రూ.1000 అదనంగా రవాణ చార్జీలు పడుతున్నాయి. ఇక మిల్లర్లు పచ్చిఒడ్లను క్వింటాల్‌కు రూ.2,150 ధర చెల్లిస్తున్నారు. కొందరు రైతులైతే మార్కెట్‌కు వెళ్లి కష్టాలు పడేకంటే పచ్చిఒడ్లనే మిల్లుల్లో అమ్ముకుని దర్జాగా ఇంటికి వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement