జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్
సిద్దిపేటకమాన్: ప్రతీ పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టు నుంచి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వరకు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట కోర్టు వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 25మంది రక్తదానం చేయగా వారిని న్యాయమూర్తి అభినందించారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సౌజన్య, న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోశ్‌కుమార్, సాధన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ బాబు, న్యాయవాదులు, లా కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాయపోల్ విద్యార్థులు
దుబ్బాకటౌన్: రాయపోల్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన రాయపోల్ విద్యార్థులు రిషి, సౌమ్యలను బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నిర్వహించనున్న 70వ ఎస్‌జీ ఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ముఖ్యం
రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్
సిద్దిపేటజోన్: పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఈనెల 19న జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు వర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు యాదగిరి, మహేందర్, మాజీ కౌన్సిలర్లు మహేందర్, ఆనంద్, రియాజ్‌లతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం ఇందిరమ్మ బీమా పథకం ఇక్కడి నుంచే ప్రజలకు సీఎం అంకితం చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు.
వెంటనే పీఆర్సీ ప్రకటించాలి
మర్కూక్(గజ్వేల్): పీఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో బుధవారం సంఘం నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..పీఆర్సీ ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఉపాధ్యాయ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


