సీపీ రష్మీ పెరుమాళ్
మద్దూరు(హుస్నాబాద్): నేర పరిశోధనలకు సీసీ కెమెరాలు కీలకంగా నిలుస్తాయని సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో దాత ఇమ్మడి శ్రీధర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను సీపీ రష్మీ పెరుమాళ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దన్నారు. బైరాన్‌పల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలు, పంచాయతీ పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం బైరాన్‌పల్లిలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన బురుజును ఆమె సందర్శించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీకి సర్పంచ్ జ్ఞాపికను అందజేశారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని గ్రామాన్ని టూరిజం హబ్‌గా తయారు చేసేందుకు కృషి చేయాలని సీపీకి సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హుస్నాబా ద్ ఏసీపీ సదానందం, చేర్యాల సీఐ రమేశ్, మద్దూరు, కొమురవెళ్లి ఎస్‌ఐలు మహ్మద్ ఆసీఫ్, మహేశ్, ఏఎస్‌ఐ తిరుమల్‌బాబు,హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


