సామాన్యుడు విలవిల
బియ్యం..
మార్కెట్‌లో బియ్యం ధరలు భయంగొల్పుతున్నాయి. ధరలు చుక్కలనంటుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. బ్రాండ్ల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ సామాన్యుడి పాలిట గుదిబండలా మారింది. మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే జై శ్రీరామ్(జేఎస్‌ఆర్) రకం బియ్యం కిలో రూ.96 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేక కమిటీ వేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ‘సాక్షి’ రక్షేతస్థాయిలో పరిశీలించగా విస్తూపోయే విషయాలు వెలుగు చూశాయి. – సాక్షి, సిద్దిపేట
బియ్యం కొనుగోలుకు వెళ్లిన వినియోగదారులకు కొత్త సమస్య ఎదురవుతోంది. ఒకే రకమైన బియ్యాన్ని రంగు రంగు బ్యాగుల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి ధరలు పెంచుతున్నారు. ఒక్కో రకానికి ఒక్కో ధర చెబుతున్నారు. కొత్త బియ్యం అన్నం ముద్దగా అవుతుంది.. పాత బియ్యం అయితే అన్నం ఎదుగు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు మంచి బియ్యం కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు.
జేఎస్‌ఆర్ కిలో రూ.96.. కొనేదెలా?
ప్రభుత్వం నిబంధనల ప్రకారం వివిధ రకాల బియ్యాన్ని కిలోకు రూ.66 నుంచి రూ.79 వరలకు మాత్రమే విక్రయించాలి. కానీ మార్కెట్లో జై శ్రీరామ్(జేఎస్‌ఆర్) బియ్యం కిలో రూ.96 వరకు విక్రయిస్తుండటం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు తోడు బియ్యం ధరలు కూడా అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 25 కిలోల బియ్యం కొనుగోలు చేస్తే రూ.2,400 ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ధరల భారాన్ని భరించలేకపోతున్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
జై శ్రీరామ్ బియ్యం కిలో రూ.96 వరకు విక్రయం
ఒకే బ్రాండ్‌లో కొత్తవి.. పాతవి.. సన్నాలంటూ వివిధ ధరలు
నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసినా కనిపించని ఫలితం
ధరలు ఇలా(కిలో) ..
బియ్యం రకం ప్రభుత్వం మార్కెట్‌లో
నిర్ణయించిన గరిష్ట ధర
గరిష్ట ధర
బీపీటీ/కెఎన్‌ఎం రూ. 66 రూ. 76
ఆర్‌ఎన్‌ఆర్ రూ. 74 రూ. 85
హెచ్‌ఎంటీ/జేఎస్‌ఆర్ రూ. 79 రూ. 96
పట్టికలు పేరుకే..
బియ్యం ధరలను నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రాహ్మారావు, తునికల కొలతల అధికారి శివరంజిని, సీటీఓ వేణుగోపాల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. దుకాణాల వద్ద వివిధ రకాల బియ్యం ధరలను ప్రదర్శించాలని ఆదేశించింది. దీంతో వ్యాపారులు దుకాణాల ముందు ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. అయితే అవి కేవలం ప్రదర్శనకే పరిమితమవుతున్నాయి. పట్టికలో పేర్కొన్న ధరలకు, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ధరలకు పొంతన ఉండటం లేదు. పట్టికలు ఏర్పాటు చేయించడంతోనే బాధ్యత ముగిసిందని భావించకుండా వాటి అమలును పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా అధికారులు దృష్టి పెట్టి సామాన్యులకు అందుబాటు ధరలకు బియ్యం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.


