హుస్నాబాద్: నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులకు కార్తీక మాసంలో శ్రీకారం చుట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయాల అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖ స్థపతి, ఇతర అధికారులు, పండితులు, నిపుణులతో అభివృద్ధి పనుల ప్రణాళికపై చర్చించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి రూ.3.80 కోట్లు, హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి రూ.80 లక్షలు, పొట్లపల్లి రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయ గర్భగుడిని రాతి కట్టడంతో నిర్మించాలని నిర్ణయించారు. పొట్లపల్లి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలన్నారు. ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, స్థపతి శ్రీవల్లి నాయగం, డీఈ ఓం ప్రకాష్, ఈఓ కిషన్ రావు, పండితులు వినయ్ శర్మ, సతీష్ శర్మలు ఉన్నారు.
కార్తీక మాసంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మంత్రి పొన్నం ప్రభాకర్
దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష


