హుస్నాబాద్: నియోజకవర్గంలో పూర్తిగా ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఇళ్లను కేటాయిస్తోందన్నారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఇల్లు పొందని నిర్వాసితులకు భూమి ఉండి నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి కూడా ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి జనగామ మార్గంలో అక్కన్నపేట మీదుగా రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే చౌటపల్లి వద్ద ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములిచ్చిన వారికి అర్హత ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మంత్రి పొన్నంకు కేంద్రమంత్రి లేఖ..
హుస్నాబాద్ నియోజకవర్గంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం భూపేందర్ యాదవ్ మంత్రి పొన్నంకు లేఖ రాశారు. గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర వేడుకల్లో వినియోగించుకునేందు కు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రల పూర్తి సెట్లతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు ఆలోచన ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాలను క్షేత్రస్థాయిలో తగ్గించేందుకు దోహదపడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతోపాటు సమాజంలోని అన్ని వర్గాలు సమన్వయంతో ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


