విద్యుత్ సిబ్బందే మరమ్మతులు చేయాలి
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత సాకుతో బయటివారికి అవకాశం
● తరచూ ప్రమాదాలు..
చోద్యం చూస్తున్న అధికారులు
సరైన శిక్షణ, భద్రతా పరికరాలు, అధికారిక పర్యవేక్షణ లేకుండా ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేపడుతుండటంతో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నంగునూరు మండలం సిద్దన్నపేటలో ఈ నెల 21న జరిగిన ప్రమాదం ఈ వ్యవహారానికి అద్దం పడుతోంది. విద్యుత్ మరమ్మతులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేయడంతోపాటు అధికారిక సిబ్బందితోనే పనులు చేపట్టేలా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సిద్దన్నపేట ఘటనతోనైనా మేల్కొంటారా?
నంగునూరు మండలం సిద్దన్నపేటలోని కుర్మసంఘం భవనం సమీపంలో ఈ నెల 21న ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు వ్యక్తి (హెల్పర్‌గా పిలుస్తారు) లక్ష్మయ్య ఎల్‌సీ తీసుకుని మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ పనుల్లో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నాలుగైదు గ్రామాలకు ఒక్కరే!
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత క్షేత్రస్థాయిలో సమస్యగా మారింది. ఒక్కో లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్‌కు నాలుగు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒక్కో గ్రామంలో ఒకరు నుంచి ఇద్దరు వరకు హెల్పర్లను ఆయా లైన్‌మెన్‌లే నియమించుకుంటున్నారు. వారిచే మరమ్మతులు, కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు, చిన్నచిన్న మరమ్మతులు, ఇతర పనులను బట్టి రూ.300 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కేటాయించిన గ్రామాల్లో లేదా సమీపంలో అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
ప్రైవేటు మరమ్మతులకు అడ్డుకట్ట వేయాలి!
సిద్దన్నపేట ఘటనను హెచ్చరికగా తీసుకుని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలి. ఇలా ఒక్క సిద్దన్నపేటలోనే కాదు చాలా గ్రామాల్లో ప్రైవేట్ వ్యక్తులతో లైన్‌మెన్‌లు పనులు చేయిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైన ఘటనలున్నాయి. గ్రామాలవారీగా సిబ్బంది కొరతను గుర్తించి అవసరమైన నియామకాలు చేపట్టాలి. కేటాయించిన ప్రాంతాల్లో లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
విద్యుత్ స్తంభాలెక్కేది ప్రైవేటు వ్యక్తులు..ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేసేదీ వారే! ఎక్కడైనా విద్యుత్ అంతరాయమేర్పడితే వినియోగదారులు ఆశ్రయించేది వారినే! విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌లు సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పనిని బట్టి రూ.300 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. – సాక్షి, సిద్దిపేట
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆ శాఖలో పని చేస్తున్న సిబ్బంది మాత్రమే మరమ్మతులు చేపట్టాలి. ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించవద్దు. ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని నా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్ల కొరత ఉంది.
– చంద్రశేఖర్, ఎస్‌ఈ, టీజీ ఎస్పీడీసీఎల్


