పార్టీ బలోపేతానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అలయ్‌ బలయ్‌ విజయవంతం చేయండి బీహెచ్‌ఎంఎస్‌లో చేరే అవకాశం ఉచిత నేత్ర వైద్య శిబిరానికి స్పందన భేష్‌ రవీందర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు ఆరుతడి పంటలే వేయాలి

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌

హుస్నాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన హుస్నాబాద్‌ మండల స్థాయి పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.

గజ్వేల్‌రూరల్‌: దసరా ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పట్టణంలోని లక్ష్మణ్‌ గార్డెన్స్‌లో ఈ నెల 25న జరగనున్న ఆలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పొన్నాల కుమార్‌, నీరుడి స్వామి, బాకి స్వామి, కన్నాయాదవ్‌, నర్సింహులు పిలుపునిచ్చారు. అలయ్‌ బలయ్‌కి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తావద్ద ఆవిష్కరించారు.

ములుగు(గజ్వేల్‌): నీట్‌ పరీక్షలో అర్హత సాధించి, ఎంబీబీఎస్‌ సీటు పొందలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామ హంస హోమియోపతి మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమేశ్‌ అక్కలదేవి సూచించారు. హోమియోపతి వైద్య విద్యలో బీహెచ్‌ఎంఎస్‌ కోర్సు ద్వారా వైద్య రంగంలో స్థిరపడేందుకు అవకాశం ఉందని తెలిపారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేట్‌ హోమియోపతి వైద్య కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్‌ కోటా (బీ,సీ ఎన్‌ఆర్‌ఐ కేటగిరీలు)సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైనట్లు పేర్కొన్నారు. క్షీరసాగర్‌ హంస హోమియోపతి మెడికల్‌ కళాశాలలోబి కేటగిరీలో 35, సీఎన్‌ఆర్‌ఐ కేటగిరీలో15 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. దరఖాస్తు సమర్పణకు అక్టోబర్‌ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందన్నారు.

బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆస్పత్రి సౌజన్యంతో శుక్రవారం బెజ్జంకిలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 80 మందికి పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన 27 మందిని గుర్తించి రేకుర్తి ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి మందులు పంపిణీ చేశారు.

గజ్వేల్‌: కుకునూర్‌పల్లి మండలం లకుడారం గ్రామంలో ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌పై దసరా రోజు దాడి చేసిన కాంగ్రెస్‌ నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గడీల కుమార్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...దేవీ రవీందర్‌ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే సహించేదిలేదన్నారు.

సిద్దిపేటరూరల్‌: ఎల్‌నినో వాతావరణ పరిస్థితిని అధిగమించేందుకు రైతులు యాసంగిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని సిద్దిపేట ఆత్మకమిటీ చైర్మన్‌ పూజల గోపీకృష్ణ సూచించారు. మండల పరిధిలోని చిన్నగుండవెళ్లి గ్రామంలో శుక్రవారం ఖేత్‌బచావో అభియాన్‌ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీకృష్ణ మాట్లాడుతూ...ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పెసర్లు, నువ్వులు సాగు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement