ఆహారంలో చిరుధాన్యాలు ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

ఆహారంలో చిరుధాన్యాలు ప్రత్యేకం

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ఆరోగ్యకరమైన ఆహారంలో చిరుధాన్యాలు ప్రత్యేకమైనవని వ్యవసాయ పరిశోధన అధిపతి డా.జి.సంతోశ్‌కుమార్‌ పేర్కొన్నారు. అక్కన్నపేట మండలం శ్రీరాంతండా గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు(పచ్చ జొన్న) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన దేశంలో వ్యవసాయ సాగు విస్తీర్ణంలో దాదాపు 60% ప్రాంతంలో వర్షాధారంగా సేద్యం చేస్తున్నారన్నారు. వీటిలో తృణధాన్యాల సాగు 75% కాగా, దీనిలో ముతక తృణధాన్యాలైన జొన్న అధికంగా సాగవుతున్నాయన్నారు. చిరుధాన్యాల సాగు చాలా తక్కువ నీటి వసతి, తక్కువ పెట్టుబడి, తక్కువ వనరుల, తక్కువ రసాయన మందులతో కూడుకున్నదని చెప్పారు. ఆర్థిక, ఆహార, ఆరోగ్య భద్రతనిచ్చే చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వివిధ పంటలతో పోల్చుకున్నప్పుడు ఈ జొన్నపంట తక్కువ నీటి వసతితో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. పీవైపీఎస్‌–2 (పాలెం పచ్చజొన్న–01)రకం వానాకాలం, యాసంగి కాలాల సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పంటలలో విత్తనోత్పత్తి గురించి రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.పల్లవి, డి.శ్వేత, ఎ.సరిత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బానోతు వెంకటేశ్‌ నాయక్‌, ఏఓ తస్లీమా సుల్తానా, ఏఈఓ కరంటోతు శ్రీలత, ఉప సర్పంచ్‌ భూక్య రాజునాయక్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో

చిరుధాన్యాలు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement