● వైద్యానికి రూ.1.20 కోట్లు ఖర్చు ● అయినా దక్కని ప్రాణం
తొగుట(దుబ్బాక): తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారిని దక్కించుకునేందుకు ఆ తల్లిదండ్రులు పడిన శ్రమ అంతాఇంతా కాదు.. రూ.1.20కోట్లు వెచ్చించినా చివరకు చిన్నారి ప్రాణం దక్కలేదు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి ఘణపురానికి చెందిన రియాన్షిక (7) తలసేమియా వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. గ్రామానికి చెందిన శివంది లింగం, లాస్య దంపతులకు కుమారుడు రుషి (9), కూతురు రియాన్షిక ఉన్నారు. ఆరు నెలల క్రితం రియాన్షిక అస్వస్థతకు గురైంది. దీంతో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లారు. వైద్యులు తలసేమియా వ్యాధిగా నిర్ధారించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరు నెలలుగా చికిత్స చేయించారు. ఎలాగైనా కూతురును బతికించుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు. బంధువుల వద్ద అప్పుచేశారు. వైద్యం కోసం ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి అమ్మి విక్రయించి చికిత్స చేయించారు. రూ.1.20కోట్లు వరకు ఖర్చుచేశారు. అయినప్పటికీ ఫలితంలేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో విషాదం నెలకొంది.


