● డీఐఈఓ రవీందర్‌రెడ్డి ● ముగిసిన ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీలు
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్‌జీఎఫ్ పోటీలు చక్కని వేదికగా నిలుస్తున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి, ఎస్‌జీఎఫ్ అండర్ 19 జిల్లా చైర్మన్ రవీందర్‌రెడ్డి అన్నారు. నాలుగు రోజులుగా స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న అండర్ 19 ఎస్‌జీఎఫ్ బాలబాలికల కబడ్డీ పోటీలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. కార్యక్రమానికి డీఐఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైదానంలో చూపించే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి ముఖ్యమన్నారు. గెలుపు ఒక్కటే లక్ష్యం కాకుండా పోటీల ద్వారా అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలల నుంచి వచ్చిన బాలబాలికల జట్లు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాయి. క్రీడాకారులు పట్టుదలతో పోరాడటంతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. బాలికల విభాగంలో ఎంజేపీ చింతమడక జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఎంజేపీ వర్గల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలించింది. ఇక బాలుర విభాగంలో మద్దూర్ మోడల్ స్కూల్ జట్టు ప్రథమ స్థానంలో, చేర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎస్‌జీఎఫ్ అండర్ 19 జిల్లా కార్యదర్శి మంతెన సమ్మయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపల్ ప్రమీలతో కలిసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో కబడ్డీ కోచ్ వెంకటేష్, కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జి అశోక్, అధ్యాపకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


