● రూ.5.20 కోట్లతో బ్రాంచ్‌ల పునర్నిర్మాణం
● నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్‌లైన్‌లో టెండర్ ప్రక్రియ
● సుమారు రూ.కోటి వరకు ముడుపులు?
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బ్రాంచ్‌ల రినోవేషన్ (పునర్ నిర్మాణం) పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. సుమారు రూ. ఐదు కోట్లకు మించి అంచనా వ్యయం కలిగిన ఈ పనులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అందిన కాడికి దండుకున్నారు. దాదాపు పదేళ్లుగా పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’ అధికారి పాలకవర్గంలోకి కీలక నేత కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న డీసీసీబీ బ్యాంకుల బ్రాంచ్‌లను రినోవేషన్ చేయాలని నిర్ణయించారు. ఆయా బ్రాంచుల్లో కొత్త ఫర్నీచర్, ఇంటీరియర్, క్యాషియర్ కౌంటర్, బీఎం క్యాబిన్, లాకర్లు, కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఇలా.. ఆయా బ్రాంచులను రినోవేషన్ చేశారు. ఏ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లోనైనా రూ.5 లక్షలకు మించి అంచనా వ్యయం కలిగిన పనులను ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువకు టెండర్ కోట్ చేస్తే వారికి పని అప్పగిస్తారు. కానీ ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిస్తే పోటీ ఎక్కువై తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు దక్కవు. దీంతో ఆఫ్‌లైన్ పేరుతో మొక్కుబడిగా టెండర్ ప్రక్రియ నిర్వహించి మమ అనిపించారు. తమకు అనుకూలైన కాంట్రాక్టర్లకు ఈ రినోవేషన్ పనులు కట్టబెట్టి అందిన కాడికి దండుకున్నారు. ఇలా 26 బ్రాంచులకు సగటున సుమారు రూ.20 లక్షల చొప్పున రూ.5.20 కోట్లు పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. ఈ పనుల్లో ఏకంగా సుమారు రూ.కోటికి మించి చేతులు మారినట్లు అనధికారిక అంచనా.
ఆ కాంట్రాక్టర్లకే ఎక్కువ పనులు
ఈ రినోవేషన్ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు ఐదారు కట్టబెట్టారు. ఎనిమిది కాంట్రాక్టర్లు, కంపెనీల పేరుతో ఈ పనులు చేపట్టి.. అందిన కాడికి దండుకున్నారు. బ్యాంకు ప్యానల్ ఇంజనీర్లు వేసిన ఎస్టిమేషన్ల కంటే ఎక్సెస్ (ఎక్కువ)కు టెండర్లు దక్కించుకుని అంచనా వ్యయం కంటే అదనపు దోపిడీ చేసినట్లు తెలుస్తోంది.
భారీగా పర్సెంటేజీలు
డీసీసీబీకి కొత్తగా ఐదు బ్రాంచులను ఏర్పాటు చేసేందుకు 2023లో ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ బ్రాంచులకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కూడా ఒక్కో భవనానికి రూ. లక్షల అంచనా వ్యయంతో పనులు చేశారు. అయితే ఈ పనులకు ఆన్‌లైన్ టెండర్లు పిలిచినప్పటికీ.. బిల్లుల చెల్లింపుల్లో భారీ మొత్తంలో పర్సెంటేజీలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వివరాలిచ్చేందుకు నిరాకరణ
రినోవేషన్ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు డీసీసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు. విచారణ దశలో ఉన్నప్పుడు ఈ వివరాలు ఇవ్వడం కుదరదని దాటవేస్తుండటం పలు ఆరోపణలు దారితీస్తోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకే పూర్తి వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 60 వేల మంది రైతులు చెల్లించే వడ్డీలపై నడుస్తున్న ఈ బ్యాంకులో అక్రమార్కులు అందిన కాడిక దండుకుని జేబులు నింపుకుంటున్న వ్యవహరాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రినోవేషన్ పనుల వివరాల కోసం ‘సాక్షి’ ప్రతినిధి డీసీసీబీ ఇన్‌చార్జి సీఈఓ సురేష్‌ను సంప్రదించగా.. విచారణ కొనసాగుతుండగా వివరాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.


