కేసీఆర్‌ వస్తేనే ప్రజలకు భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వస్తేనే ప్రజలకు భవిష్యత్తు

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

● కాంగ్రెస్‌ సర్కార్‌లో కానరాని సంక్షేమ పథకాలు ● మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

● కాంగ్రెస్‌ సర్కార్‌లో కానరాని సంక్షేమ పథకాలు ● మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేటరూరల్‌: బీఆర్‌ఎస్‌ హయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ ఆగం చేసిందని, మళ్ళీ కేసీఆర్‌ వస్తేనే ప్రజలు, రైతులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాంపూర్‌లో నూతనంగా నిర్మించిన హనుమాన్‌ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేడు యూరియా, డీఏపీ కోసం 15 రోజుల పాటు క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతుబంధును ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఎగబెడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు.

చతికిలబడిన విద్యావ్యవస్థ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ చతికిలబడిందని, స్కూల్‌ గ్రాంట్స్‌ నిల్‌ అని, స్కావెంజర్లకు జీతాల్లేవని, మన ఊరు మన బడి బంద్‌ అయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ఉద్యోగి కనకయ్య పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతు పాఠశాలలు ప్రారంభం అయ్యి మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో స్కూల్‌ ప్రారంభం కాకముందే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించామన్నారు. యూనిఫాంలు, స్కూల్‌ బ్యాగ్‌, టై, షూస్‌లు వెంటనే విద్యార్థులకు అందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. జీవో 97 తీసుకువచ్చి వేలాది మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులను రోడ్డు మీదకు తెచ్చారన్నారు.

సెల్‌ఫోన్‌ వ్యసనం మంచిది కాదు

సిద్దిపేటజోన్‌: ‘ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ అనేది పిల్లలకు ఒక వ్యసనంగా మారిపోయింది. భోజనం చేసేటప్పుడు ఫోన్‌ చూస్తే గాని ముద్ద మింగలేని పరిస్థితికి చాలా మంది పిల్లలు వచ్చేశారు. ఇది మంచిది కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక మెరీడియన్‌ స్కూల్‌ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్‌ పక్కన పెట్టి ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, క్రికెట్‌ లాంటి క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచించారు. పిల్లలను మొబైల్‌ ఫోన్‌లకు దూరం చేసే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పైన ఉందన్నారు. ఇక్కడ చదివిన అఖిల అనే అమ్మాయి మెడిసిన్‌ సిటు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఐదేండ్ల డాక్టర్‌ కోర్సు ఫీజు ఖర్చుల బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చెస్‌ లాంటి ఆట మనలో మెదడుకు పదును పెడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్స్‌. సూడా మాజీ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ తిరుమాల్‌ రెడ్డి, పాఠశాల డైరెక్టర్లు దేవేందర్‌ రెడ్డి, రాజా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement