కరెంట్‌ కట్‌కట్‌ | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కట్‌కట్‌

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

సాగుకు విద్యుత్‌ సరఫరా 24 గంటలు కాదు.. 12 గంటలే

ఓ వైపు సహకరించని ప్రకృతి... మరోవైపు కరెంట్‌ కోతలు

బోర్లు, బావులున్నా సాగు చేద్దామంటే..అడ్డంకిగా విద్యుత్‌

కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు

వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాపై ‘సాక్షి’పరిశీలన

వ్యవసాయ సీజన్‌ పూర్తిస్థాయిలో జోరందుకోక ముందే విద్యుత్తు సరఫరాలో కోతలు పెడుతున్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. 24గంటల విద్యుత్తు సరఫరా ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. అందులో సగం అంటే 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

సాక్షి, సిద్దిపేట: ఓ పక్క వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బంది పడుతుండగా..బోర్లు, బావులు అందుబాటులో ఉన్న వారు కొంతభాగం సాగు చేస్తున్న రైతులను విద్యుత్తు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వచ్చే విద్యుత్తులోనూ మధ్య మధ్యలో కోతలు పెడుతుండటంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు.

సహకరించని ప్రకృతి

జిల్లా వ్యాప్తంగా 1.90లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉండటంతో బోర్లు, బావులు ఉన్న వారే సాగు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.60లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగుతున్నాయి. వరి పంటలు సాగు చేసేందుకు నార్లు పోసి రైతులు దిక్కులు చూస్తున్నారు. వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 31% లోటు వర్షపాతం నమోదైంది. బోర్లు, బావుల మీద ఆధారపడి పంటలు సాగుచేయాలనుకునే వారు విద్యుత్తు కోతలను చూసి రైతులు ముందుకురావడం లేదు. ఓ వైపు ప్రకృతి సహకరించడం లేదు. మరోవైపు విద్యుత్‌ అధికారులు 24గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదు. దీంతో సాగు చేస్తున్న వారు...సాగు చేయాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు.

వ్యవసాయానికి 10 నుంచి 12 గంటలే

క్షేత్రస్థాయిలో విద్యుత్తు సరఫరాను సోమవారం ‘సాక్షి’పరిశీలించింది. పలు మండలాల్లోని సబ్‌స్టేషన్లవారీగా పరిస్థితి ఎలా ఉందని రైతులు, ప్రజలను ఆరా తీసింది. ఈ పరిశీలనలో చాలాచోట్ల 10 నుంచి 12గంటలు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు స్పష్టమైంది. దీనికితోడు లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే వస్తున్న కరెంటు కూడా పదేపదే ట్రిప్‌, విద్యుత్తు మరమ్మతుల కోసం ఎల్‌సీ తీసుకుంటున్నారు. ఈసారి వర్షాలు లేకపోవడంతో రైతులు బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడి సాగుకు సిద్ధపడ్డారు.

సరఫరా అంతంతమాత్రమే

● హుస్నాబాద్‌ మండలం తోటపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయానికి 13గంటల త్రీఫేస్‌ విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌లో సోమవారం లాంబో పగిలిపోవడంతో మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. దీంతో తోటపల్లి పరిధిలో 9:30గంటలే విద్యుత్తు సరఫరా అయింది.

● కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్‌స్టేషన్‌లో ప్రతీ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్‌ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రెండుసార్లు ఎల్‌సీ తీసుకుని విద్యుత్తు వైర్ల మరమత్తులు చేశారు. చేర్యాల మండలంలో సైతం ఉదయం 5 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్తు సరఫరా అందించగా రెండుసార్లు ఎల్‌సీ తీసుకున్నారు.

● మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్‌ను అందిస్తున్నారు. ఖాజీపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో కార్బన్‌ రావడంతో విద్యుత్‌ దాదాపు గంట పాటు వివిద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

● కోహెడ మండలంలో సైతం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. మండలంలో పలు చోట్ల రెండు నుంచి మూడుసార్లు ఎల్‌సీ తీసుకోవడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement