వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): అమ్మకు కూరగాయలే ఆభరణాలయ్యాయి. ఫలాలే పూలహారాలుగా ఒదిగిపోయాయి. ఆలయం పందిరితోటను తలపించింది. సోమవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ కూరగాయలు, ఫలాలు ఆభరణాలుగా ధరించి వర్గల్ శ్రీవిద్యాసరస్వతి అమ్మవారు శాకాంబరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మూలవిరాట్టుకు విశేషాభిషేకం చేశారు. ఆషాఢానికి ప్రతీకగా ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, సప్తశతి పారాయణం, చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.


