సిద్దిపేటరూరల్: ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల్లో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గ్రామాల్లో పనులు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ హైమావతి ఎల్‌నినో ప్రభావంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రెండు రోజులలో మండల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులను, మండల స్థాయి అధికారులను ఆహ్వానించి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. రైతులకు వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు పండించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ భూమి ఖాళీగా ఉంచకుండా ప్రతీ రైతు ఏదో ఒక మెట్ట పంట పండించేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు తాగునీటికి సరిపోతాయని, బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు త్రాగునీరు సరఫరాకు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా ముందస్తుగా పర్యవేక్షించాలన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 100 ఫామ్ పాండ్స్ నిర్మించాలన్నారు. వీటితోపాటు పెరుక్యులేషన్ పాండ్స్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, కమ్యూనిటీ, పర్సనల్ సోక్ పిట్స్, ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో రూప్‌టాప్ వాటర్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతులు, సమస్యలను క్షేత్రస్థాయిలో సమీ క్షించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేశ్‌రామ్, ఇరిగేషన్ ఈఈ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంపై అధికారుల సమీక్షలో కలెక్టర్ హైమావతి


