ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: క్యాన్సర్ అంటే భయపడకుండా ముందస్తుగా వ్యాధి నిర్ధారణతో మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చని అందుకే ఈ నెల 29న సిద్దిపేట ప్రజల కోసం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. 40ఏండ్లు నిండిన ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింధూ క్యాన్సర్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత నిర్ధారణ శిబిరాన్ని స్థానిక విపంచి ఆడిటోరియంలో ఈ నెల 29న ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభ దశలో లక్షణాలు కన్పించవని, కానీ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా లక్షణాలు బయట పడతాయన్నారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బారిన పడి చాలామంది మహిళలు చనిపోతున్నారని, దీనికి కారణం లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడమేనన్నారు. గతంలో కొన్ని స్క్రీనింగ్ టెస్టు శిబిరాలు ఏర్పాటు చేసి, క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సకాలంలో చికిత్స ఇవ్వడంతో ప్రస్తుతం వారు ప్రాణాలతో బయటపడ్డారన్నారు. మహిళలకు అవసరం మేరకే పాప్ స్మియర్ టెస్ట్, రక్త పరీక్షలు, ఎక్స్ రే లాంటివి చేస్తారన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాకటౌన్: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం అత్యంత అవసరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ జిమ్‌ను కొత్త ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతీ రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఫిట్నెస్‌తోపాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధునిక ఫిట్నెస్ కేంద్రాలు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
పీఆర్‌టీయూ నాయకుల డిమాండ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వేసవి సెలవుల్లో జనగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ డిమాండ్ చేశారు. సోమ వారం జిల్లా విద్యాశాఖ ఇన్‌చార్జి అధికారి రమేశ్ కు పీఆర్టీయూ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. భారత ప్రభుత్వం ప్రతీ పదేళ్లకు ఒక సారి నిర్వహించే జనగణనలో వేసవికాలాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలో ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు.
ఆర్డీఓ సదానందం
సిద్దిపేటజోన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆర్డీఓ సదానందం ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ఐదు దరఖాస్తులను స్వీకరించారు.


