కొత్త పంట | - | Sakshi
Sakshi News home page

కొత్త పంట

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

ఎల్‌నినో తంట..

ఆయిల్‌పామ్‌ వైపు

రైతుల మొగ్గు

ఈ ఏడాది 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యం

ఊపందుకున్న ప్లాంటేషన్‌

ఇప్పటికే 710ఎకరాల్లో పూర్తి..

గతంతో

పోలిస్తే రికార్డే..

జిల్లాలో 2021–22లో ప్రారంభమైన ఆయిల్‌పామ్‌ సాగు ప్రస్తుతం 15వేల ఎకరాలపైచిలుకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం వేసిన తోటల్లో ప్రస్తుతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 7 టన్నులకుపైగా ఉత్పత్తులు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయిల్‌ఫెడ్‌ సంస్థ నుంచి జిల్లా రైతులకు రూ.18కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. జిల్లాలోని నర్మెటలో ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం, ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్‌కు అవకాశముంది. ఇక్కడి నుంచి ప్యాకింగ్‌ ఉత్పత్తులు నేరుగా మార్కెట్‌లోకి వెళ్లే అవకాశం కలిగింది.

వర్షపాతం తగ్గడంతో..

యిల్‌పామ్‌ సాగుకు సంబంధించి ఈసారి జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా వర్షపాతం తగ్గడం, గత సీజన్‌లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా యాతన పడటం వల్ల ఈసారి రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే.. గతంలో రూ.17,500 ఉన్న ఆయిల్‌పామ్‌ గెలల టన్ను ధర ఆరునెలలుగా అమాంతంగా రూ.23వేల పైచిలుకు పలుకుతుండటం.. ప్రస్తుతం రూ.23,837కు చేరుకోవడం కూడా కలిసి వస్తున్నది.

జోరుగా ప్లాంటేషన్‌..

హజంగా ఏటా ఆయిల్‌పామ్‌కు సంబంధించి అధికారులు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తారు. అది అమలు కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈసారి 4వేల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రైతులు 500ఎకరాల్లో ప్లాంటేషన్‌ పూర్తి చేశారు. తాజాగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆయిల్‌పామ్‌ మెగా ప్లాంటేషన్‌లో మరో 210ఎకరాల్లో సాగు కొత్తగా చేరింది. దీంతో ఈ సీజన్‌లో 710ఎకరాల్లో ఇప్పటివరకు సాగులోకి వచ్చింది. నిజానికి ఏటా ప్రతి సీజన్‌లో ఈ సమయానికి 100ఎకరాల్లోపు ప్లాంటేషన్‌ అవడమే గగనం. కానీ ఈసారి ప్లాంటేషన్‌ రికార్డు స్థాయిలో ఊపందుకున్నది. అంతేకాకుండా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకురావడం వల్ల మరో 2,631ఎకరాల్లో ప్లాంటేషన్‌కు అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకున్నారు. త్వరలోనే ప్లాంటేషన్‌ను పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఆయిల్‌ఫామ్‌ రైతుల అవసరాల కోసం 1200ఎకరాల్లో డ్రిప్‌ ఇవ్వడానికి సైతం కార్యాచరణ సిద్ధం చేశారు.

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. జిల్లాలో రైతుల ఆలోచన విధానాన్ని మార్చింది. ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గు చూపేలా చేసింది. ఈ ఏడాది అధికారులు 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్లాంటేషన్‌ ఊపందుకుంది. 710 ఎకరాల్లో పూర్తికాగా, మరో 2,631 ఎకరాలకుపైగా సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే ఇది రికార్డు. ప్రస్తుతం జిల్లాలో సాగు 15వేల ఎకరాల పైచిలుకు చేరుకున్నది. – గజ్వేల్‌

మారుతున్న ఆలోచన విధానం

జిల్లాలో సాధారణంగా వానాకాలం సీజన్‌లో 5.50లక్షల ఎకరాల్లో, మరో 2.50లక్షల ఎకరాల్లో యాసంగిలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. మూస పద్ధతుల్లో సాగు కొనసాగటం వల్ల రైతులకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలను, ప్రధానంగా వరి సాగును తగ్గించి ఆయిల్‌పామ్‌ను పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులకు వెంటనే డ్రిప్పు పరికరాలు అందిస్తున్నారు. అవసరమయ్యే కూలీల ఖర్చులు, ఎరువులతోపాటు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తున్నారు. దీంతో రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తున్నది.

రైతుల్లో మార్పు..

ఎల్‌నినో పరిస్థితులు, వరి సాగులో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. 4వేల ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటికే 710ఎకరాల్లో ప్లాంటేషన్‌ పూర్తి చేశాం. మరో 2,631ఎకరాల్లో సాగు చేపట్టబోతున్నాం.

– సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement