సిద్దిపేటజోన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ)ఢిల్లీ సౌజన్యంతో శనివారం జిల్లా కేంద్రంలోని మెరీడియన్ పాఠశాలలో నిర్వహించిన ఎక్స్‌పో అండ్ గైడెన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న 58 సీబీఎస్‌ఈ విద్యాసంస్థలు ఈ ఎక్స్‌పోలో పాల్గొని వందకు పైగా నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాలపై ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, సోలార్ వ్యవస్థ, పర్యావరణ, పారిశ్రామిక విధానం, పర్యాటక, గ్రామీణాభివృద్ధి, తదితర అంశాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, సాంకేతిక నమూనాలు ఎంతో ఆకర్షించాయి. కార్యక్రమంలో సీబీఎస్‌ఈ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్, తిరువనంతపురం ప్రాంతీయ డైరెక్టర్ విగ్నేష్, మెరీడియన్ విద్యాసంస్థల డైరెక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


