నాణ్యమైన ఆహారం అందించండి
● విద్యార్థినుల భద్రత ముఖ్యం ● కలెక్టర్ హైమావతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వసతి గృహంలో ఉన్న విద్యార్థినులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ హైమావతి షెడ్యూల్ కులాల వసతి గృహాల వార్డెన్ శ్వేతను ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్, వంట సరుకులను పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా లేదని వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డీఎస్సీడీఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థుల భద్రత ముఖ్యమని వసతి గృహంలో సీసీ కెమోరాలు తప్పనిసరిగా పని చేసే విధంగా ఉండాలన్నారు. వసతి గృహంలో ఉన్న సమస్యలపై విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. తాగు నీరు, శానిటేషన్ సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.


