తాయిలాల ఎర..
● ‘గంపగుత్త’ ఓట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి ● జోరుగా సంప్రదింపులు, సమావేశాలు ● తాయిలాలతో ఆకట్టుకునే యత్నాలు ● గజ్వేల్ పుర పోరు రసవత్తరం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు సామాజికవర్గాల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఎలాగైనా ‘గంపగుత్త’గా రాబట్టుకోవడానికి తాయిలాల ఎర చూపుతున్నాయి. ఇందుకోసం సమావేశాలు, సంప్రదింపులు ముమ్మరం చేశాయి. – గజ్వేల్
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మార్గాల్లో కీలకమైన సామాజికవర్గాలపై ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న సంగతి తెల్సిందే. ఒకటిరెండు చోట్ల ఇండిపెండెంట్లు, మరొకచోట ఓ పార్టీ అభ్యర్థి ప్రభావాన్ని చూపే పరిస్థితి కనపడుతోంది. ప్రచారానికి కేవలం మరో నాలుగు రోజులు ఉండటం వల్ల ఈ స్వల్ప వ్యవధిలో ఎక్కువమందిని కలిసి గెలుపు కార్యాచరణ రూపొందించుకోవడమే లక్ష్యంగా పార్టీల ముఖ్యనేతలు ముందుకుసాగుతున్నారు. ఇక్కడ 20 వార్డులు ఉండగా, ఆయా వార్డుల్లో ఏయే సామాజికవర్గాలు ప్రభావం చూపుతున్నాయే పరిశీలించి ఆమేరకు వారిని కలుస్తున్నారు.
సామాజికవర్గాలను కలిసేందుకు పట్టణంలో విస్త్రతంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సామాజికవర్గాల పెద్దల ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశాలు, సంప్రదింపుల సందర్భంగా ఓట్లు వేయించుకోవడం, మాట తీసుకోవడం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమావేశాలు, సంప్రదింపులను ఎక్కువగా ఆలయాల్లో నిర్వహిస్తున్నారు
గంపగుత్తగా ఓట్లు పడేలా చూస్తే.. భారీగా నగదుతోపాటు ఇంటింటికీ విలువైన వస్తువులను ఆఫర్ చేస్తున్నారు. ఓ అభ్యర్థి పట్టణంలో బలంగా ఓ సామాజికవర్గానికి ఇంటికో ఫ్రిజ్ ఆఫర్ చేయడానికి సిద్ధమవుతున్నారని, మరో అభ్యర్థి ల్యాప్‌టాప్, ఇంకో అభ్యర్థి గంపగుత్తగా గోవా ట్రిప్ ఆఫర్ చేయడానికి సిద్ధమయ్యారని చర్చించుకుంటున్నారు. ఇవేకాకుండా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇప్పటికే సుక్క, ముక్క పంపిణీ జోరుగా సాగుతోంది. పట్టణంలోని హాట్ సీటుగా చెప్పుకుంటున్న ఓ వార్డులో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటాపోటీగా పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక అభ్యర్థి ఉదయం చికెన్, బాస్మతీ బియ్యం అందజేస్తే.. అదే రోజు మధ్యాహ్నానికల్లా పోటీ అభ్యర్థి ఇంటింటికి హాఫ్ బాటిల్ బ్రాండెడ్ మందు పంపిణీ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇకపోతే మందు పంపిణీ సందర్భంగా ఓటర్లకు స్టఫ్ కింద మొలకలు, మిక్సర్ కూడా అందిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి సామాజికవర్గాల సంప్రదింపులు, సమావేశాలు పార్టీల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఒకటిరెండ్రోజుల్లో ఈ వ్యవహారం మరింతగా ఆసక్తికరంగా మారనున్నది.


