వచ్చేయ్.. దూకేయ్!
అసంతృప్తులపై ప్రత్యేక ఫోకస్
కౌన్సిలర్ టికెట్ ఇస్తామని హామీ
నామినేట్ పోస్టులు సైతం ఆఫర్లు
చేరికలపై ప్రధాన పార్టీల నజర్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు.. చేరికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పట్టణాల్లో కొంచెం పేరున్న వారిని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్,
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా పార్టీలలో అసంతృప్తులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కౌన్సిలర్ టికెట్ ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఒక అడుగు ముందుకేసి నామినేటెడ్ పోస్టులు సైతం ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. ఎలాగైనా బల్దియా పీఠం దక్కించుకోవాలని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
జిల్లాలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ పట్టణాల్లో గోడ దూకుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో వివిధ పార్టీల నాయకులు అటు ఇటు జంపింగ్ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో కౌన్సిలర్ టికెట్ దక్కని వారు, నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు జంప్ జిలానీల కార్యక్రమం ఊపందుకోనుంది. సాధారణ కార్యకర్త నుంచి కీలక నేతలు దాకా కండువాలు మార్చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ వీలైనంత మేర ఆకర్ష్ మంత్రం పఠిస్తున్నాయి. ఉన్న వాళ్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లిన వారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. బీజేపీ మాత్రం కాస్త వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ నుంచి దుబ్బాక మున్సిపాలిటీలోని 11వ వార్డు టికెట్ ఆశిస్తున్న రఫియుద్దిన్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ వార్డు టికెట్ రఫియోద్దిన్‌కే బీఆర్‌ఎస్ ఖరారు చేసే అవకాశం ఉంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన యువజన నాయకుడు తొండెంగుల రాజేష్ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేరారు. రాజేశ్‌కు ఐదవ వార్డు టికెట్ దక్కె అవకాశాలున్నాయి. అలాగే దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ఇంకా అవకాశం ఉంది.
ఆయా పార్టీలు కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తుంటే టికెట్ రాని ఆశావహులు వివిధ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉండటంతో టికెట్ దక్కని వారు జంప్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండు రోజులు చేరికల జోరు మరింత పెరగనుంది.
అధికార పార్టీలోకి జోరుగా జంపింగ్‌లు
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన హుస్నాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, మాజీ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో ఆకుల వెంకన్నకు ఏదైనా నామినేట్ పోస్టు ఇచ్చే అవకాశాలున్నాయి. చేర్యాల పట్టణానికి చెందిన జెన్కో రిటైర్డ్ ఎస్‌ఈ కాటం సంజీవయ్య, రిటైర్డ్ టీచర్ తేజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ పదవిని తేజ ఆశిస్తున్నారు. దుబ్బాకలోని దుంపలపల్లిలో ఇద్దరు యువ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.


