నేడు మల్లన్న చివరి వారం | - | Sakshi
Sakshi News home page

నేడు మల్లన్న చివరి వారం

Mar 15 2026 6:45 AM | Updated on Mar 15 2026 6:45 AM

భారీగా తరలిరానున్న భక్తులు

కొమురవెల్లి(సిద్దిపేట): తొమ్మిది వారాలపాటు కొనసాగిన మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం మొదలుకొని ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రాత్రి అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ముగింపు వారం భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అర్ధరాత్రి12 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. చివరి వారానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సంపూర్ణ పారిశుద్ధ్యానికి

సహకరించండి

గజ్వేల్‌: సంపూర్ణ పారిశుద్ధ్య సాధనకు అంతా సహకరించాలని గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 4, 6వ వార్డుల్లో నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని కోరారు. ఇళ్లల్లో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్‌ స్క్రాప్‌ను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటగోపాల్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు రొట్టెల శ్రీనివాస్‌, కాముని మురళి, బొగ్గుల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

అన్ని ప్రక్రియలలో

పద్యం గొప్పది

అలరించిన వద్దిపర్తి పద్మాకర్‌ శతావధానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): అన్ని ప్రక్రియలలో పద్యం స్థానం గొప్పదని అవధాని వద్దిపర్తి పద్మాకర్‌ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయంలో శనివారం జరిగిన శతావధానంలో అవధాని డాక్టర్‌ వద్దిపర్తి పద్మాకర్‌ పద్యాలతో అలరించారు. సమస్య, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి తదితర అంశాలపై వంద పద్యాలు అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, నరసింహరావు, మరుమాముల దత్తాత్రేయ శర్మ, బ్రోచ్‌ కార్‌ ఓంప్రకాష్‌, చేపూరి శ్రీనివాస్‌, మిట్టపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, దొర్భల ప్రభాకరశర్మ, మంచినీళ్ల సరస్వతి, అశోక్‌, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, విజయ్‌ కుమార్‌, శైలజ, లలిత, శివకుమార్‌, లక్ష్మణచారి తదితరులు అడిగిన పశ్నలకు పద్యరూపంలో పద్మాకర్‌ సమాధానమిచ్చారు.

మోయతుమ్మెద వాగులోకి

నీరు విడుదల

బెజ్జంకి(సిద్దిపేట): తీవ్రమైన ఎండలతో పంటలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు శనివారం కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టు నుంచి మోయతుమ్మెద వాగులోకి నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్‌ అధికారులు గాగిళ్లాపూర్‌ వచ్చే కాలువ తూము తెరిచి నీటిని సరఫరా చేశారని సర్పంచ్‌ ఎర్రల జానకి తెలిపారు. సకాలంలో స్పందించి రైతులకు లబ్ధి చేకూరేలా చేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement