కాలువకు గండి
నీట మునిగిన వరి పంటలు
● నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్
తొగుట(దుబ్బాక): మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దుబ్బాకకు వెళ్లే కాలువకు పెద్దమాసాన్‌పల్లి శివారులో గండిపడింది. దీంతో సుమారు 30 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. నీటి ప్రవాహంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాట్లువేసిన కొద్దిరోజులకే పంట పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో అధికారులు దుబ్బాక కాలువలోకి నీటిని వదిలిన విషయం తెలిసిందే. నీటి ప్రవాహంతో సుమారు కిలోమీటరు దూరంలో రాత్రి 11గంటల సమయంలో కాలువకు గండిపడింది. పంట పొలాల వద్ద ఉన్న రైతులు పరిస్థితిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై వెంటనే నీటిని నిలిపివేశారు. కాలువలో పేరుకుపోయిన పూడిక తీయకుండా అధికారులు నీటిని వదలడం వల్లే కాలువ తెగిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యంతో బతుకులు ఆగమయ్యాయని రైతులు అన్నారు. పరిహరం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా నీటిపారుదల శాఖ డీఈఈ శిరీష, వ్యవసాయాధికారి మోహన్, ఏఈఓ నారార్జున పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదుచేశారు. ఈ సందర్భంగా డీఈఈ శిరీష మాట్లాడుతూ పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వివరించారు.
కాలువకు గండి


