బల్దియాలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు
కృషి చేయాలి
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌లో చేరిన హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆకుల రజిత
హుస్నాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యతతో పని చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభిమోగించాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత నాదేనని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
పొన్నం ప్రత్యేక దృష్టి
గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా గౌరవెల్లి గురించే మాట్లాడుతారని తుమ్మల అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
సర్వే ఆధారంగానే టికెట్లు
సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు. మున్సిపల్ గెలుపుతో, అభివృద్ధి మరింత జరగాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఇరిగేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
మంత్రుల సమక్షంలో చేరికలు
బీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, మాజీ ఎంపీపీ వెంకట్, పలువురు నాయకులు మంత్రులు నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోహెడ మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫేడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు ఉన్నారు.


