తొలిరోజు 35 నామినేషన్లు
స్వీకరణ షురూ..
● రేపటితో ముగియనున్న గడువు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలలో ఆయా కమిషనర్లు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. రెండు వార్డులకు కలిపి ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులకు గాను తొలి రోజు 35 నామినేషన్లు వచ్చాయి. దుబ్బాకలో 18, గజ్వేల్‌లో 8, చేర్యాలలో 5, హుస్నాబాద్‌లో నాలుగురు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ హైమావతి పరిశీలించారు.
మంచి ముహూర్తం కోసం..
ఈ రెండు రోజుల్లో ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష్కుల దగ్గరికి పోటీ దారులు సంప్రదిస్తున్నారు. దీంతో వారు చెప్పిన సమయంలోనే నామినేషన్లను దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.
స్పీడ్ పెంచిన పార్టీలు
ఆయా వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను పార్టీలు వేగం పెంచాయి. ఇప్పటికే చేర్యాల మున్సిపాలిటీలో ఆరుగురిని ప్రకటించారు. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేశారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్‌ను ఆశిస్తున్న చోట్ల అందరిని నామినేషన్లను వేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి సమయంలో బీ ఫామ్‌లను నేరుగా ఎన్నికల అధికారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


