నేతల్లో హడావుడి..
నామినేషన్లకు ఈనెల 30 తుదిగడువు కావడంతో పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే పనిలో పడ్డారు. రేపోమాపో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకుసాగుతున్నారు.
ఇక్కడున్న 20 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే సగానికిపైగా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. మిగిలిన వార్డుల్లో ఒకటిరెండ్రోజుల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అయినా నాలుగైదు వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారింది.
అధికార కాంగ్రెస్ పార్టీలోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జోరందుకున్నది. ఈ పార్టీలోనూ చైర్మన్ అభ్యర్థి, ఇతర కీలకవార్డుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. మిగిలిన వార్డుల్లోనూ పూర్తి చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపిక స్పీడ్‌గా సాగుతోంది. ఈ పార్టీలోనూ కీలకంగా చెప్పుకుంటున్న వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావచ్చింది. కాగా ఎవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే..వారిని వచ్చే నెల 3 నామినేషన్ ఉసంహరణలోగా బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని, ఆలోగానైతే 20వార్డులకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అన్ని పార్టీల్లో హడావుడి మొదలైంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 తుది గుడువుగా విధించడంతో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. వచ్చే నెల 11న పోలింగ్ ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. – గజ్వేల్
నిన్నటిమొన్నటివరకు సాదాసీదాగా ఉన్న మున్సిపల్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడంతో సహజంగానే ఇక్కడ గెలిచే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా ముందుకుసాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడి మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవాలనే సంకల్పంతో సర్వశక్తుల ఒడ్డుతున్నాయి.
ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు..
తమ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైందని భావిస్తున్న నాయకులు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఓ నాయకుడు తనను గెలిపిస్తే.. వార్డుకు చెందిన ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. మరో నాయకుడు తన సతీమణి పోటీ చేసే వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇకపోతే మరికొందరు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొందరైతే ఇప్పటికే రెండేసి, మూడేసి రౌండ్లు తమ వార్డుల్లో ప్రచారం పూర్తి చేశారు. తాయిలాలు ప్రకటిస్తూ ఓటర్లను మచ్చికచేసుకునే పనిలో పడ్డారు. మరొకొందరు నేతలు హామీలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసిచూపిస్తానంటున్నారు. అంతేకాకుండా పార్టీల ముఖ్య నేతలు భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా వార్డుల వారీగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేపట్టి క్యాడర్‌ను కూడగట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. వార్డులవారీగా ముఖ్యమైన నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు.
రేపోమాపో కొలిక్కి..
అభ్యర్థుల ఎంపిక వడివడి
అన్ని పార్టీల్లోనూ సందడి
నేతల్లో హడావుడి..


