పకడ్బందీగా ఎన్నికలు: కలెక్టర్
సిద్దిపేటరూరల్: అందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికలు సైతం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో రాబోయే మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతులలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల గురించి మాస్టర్ ట్రైనర్ అందించే శిక్షణ క్లుప్తంగా నేర్చుకోవాలన్నారు. ఎన్నికల కరదీపికలోని మార్గదర్శకాల ప్రకారమే ప్రక్రియ జరపాలన్నారు. ప్రతి అర్‌ఓ.. ఎలక్షన్ కరదీపికపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ ప్రక్రియకు ఎలక్ట్రోరల్ రోల్ అతి ముఖ్యమైనదని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ఒక నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హుస్నాబాద్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్లు మల్లికార్జున్, రమేష్, మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
సిద్దిపేటరూరల్: ఎన్నికల మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. నియమితులైన నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీసీఈఓ రమేశ్, డిపిఆర్‌ఓ రవికుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.
నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన
గజ్వేల్‌రూరల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంక ట గోపాల్‌కు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, గజ్వే ల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి తదితరులున్నారు.


