బ్యాంకు ఉద్యోగుల నిరసన
ఐదు రోజుల పని దినాలు
అమలు చేయాలని డిమాండ్
సిద్దిపేటకమాన్: వారంలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని యూనియన్ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ సిద్దిపేట రీజినల్ సెక్రట రీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో పలు బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కాలంలో బ్యాంకు ఉద్యోగులు మాత్రం వారానికి ఆరు రోజుల పనితో ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్‌యూలు, ఐటీ, కార్పొరేట్ రంగాల్లో వారంలో ఐదు రోజుల పని అమల్లో ఉండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇది అమలు కాకపోవడం అసమానత్వానికి నిదర్శనమన్నారు. ఐదు రోజుల పని దినాల అమలుతో ఉద్యోగుల వర్క్, లైఫ్ మెరుగుపడి ఆరోగ్యం, ఒత్తిడి లేకుండా వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందిస్తారన్నారు. వివిధ బ్యాంక్‌లకు చెందిన సుమారు 200మంది సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలోపాల్గొన్నారు.


