ఒకేసారి 3 నెలల రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి 3 నెలల రేషన్‌

Mar 14 2026 10:23 AM | Updated on Mar 14 2026 10:23 AM

వేసవి కాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రం ఈ మేరకు జిల్లా సివిల్‌ సప్లై అధికారులనుసమాయత్తం చేసింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల రేషన్‌ బియ్యాన్ని ఏప్రిల్‌లో పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 30లోగా రేషన్‌ దుకాణాలకు బియ్యంచేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

– సాక్షి, సిద్దిపేట

జిల్లా వ్యాప్తంగా 3,33,332 రేషన్‌ కార్డులు కార్డులుండగా అందులో అంత్యోదయ కార్డులు 18,311, ఆహార భద్రత 3,14,940, అన్నపూర్ణ 81 కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా 6,583 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అందిస్తున్నారు. మూడు నెలలకు ఒకే సారి బియ్యంను పంపిణీ చేయాలంటే 19,749 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం.

ఇతర ప్రాంతాల నుంచి..

రేషన్‌ షాప్‌ల ద్వారా సన్న బియ్యం పంపిణీతో కార్డుదారుల నుంచి స్పందన బాగా ఉంది. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటి కంటే సన్న బియ్యం చాలా మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం తక్కువగా రావడంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డిల నుంచి తెప్పించి గోదాంలలో స్టోర్‌ చేస్తున్నారు.

భద్రపరచడమే సమస్య

గడిచిన వానాకాలంలో మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేసినప్పుడు రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్టాక్‌ భద్రపరచడానికి సరపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఒకే సారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారుల నుంచి ఈ పాస్‌ యంత్రం పై మూడు మార్లు బయోమెట్రక్‌ / ఐరీస్‌ / ఓటీపీ ద్వారా బియ్యం ఇవ్వనున్నారు. సర్వర్‌ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు వారాల పాటు రేషన్‌ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, ఇతర నిబంధనలు అప్‌డేట్‌, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కార్డుదారులు కోరుతున్నారు.

కసరత్తు చేస్తున్న సివిల్‌ సప్లయ్‌ అధికారులు

గోదాంలకు చేరుతున్న సన్నబియ్యం

జిల్లాలో 3,33,332 రేషన్‌ కార్డులు

19,749 మెట్రిక్‌ టన్నుల

బియ్యం అవసరం

కసరత్తు చేస్తున్నాం

రేషన్‌ కార్డుదారులకు ఏప్రిల్‌, మే, జూన్‌నెలలకు సంబంధించి రేషన్‌ బియ్యం ఒకే సారి ఏప్రిల్‌ నెలలో సరఫరా చేయాలని ప్రభుత్వం అదేశించింది. ఇందుకోసం సన్న బియ్యాన్ని ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నాం. కార్డుదారులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.

– గోపికృష్ణ, డీఎం,

సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌

Advertisement
 
Advertisement
Advertisement