వ్యూహాలకు పదును
చేరికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మాజీలు ప్రచారానికి బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్యనేతలు ప్రణాళికలు
హుస్నాబాద్ మున్సిపల్‌పై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఈ ప్రధాన పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. అన్ని పార్టీలు సీట్లు సర్దుబాటు చేస్తూ గెలిచే అవకాశాలున్న వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే బీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి.
– హుస్నాబాద్
రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో ఆశావహులు పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు కలియదిరుగుతున్నారు. ఏ పార్టీ గుర్తు వచ్చినా పోటీ చేయడం ఖాయమని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే ఆయా పార్టీలకు కొన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్యానెల్ కోసం వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థుల వివరాలను పార్టీ నాయకులు మంత్రికి సమర్పించారు. మార్పులు, చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. మరోవైపు చేరికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు మంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. వారు రేపో మాపో మంచి ముహూర్తం చూసుకుని చేరనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించి భంగపడేవారిని తమ పార్టీల్లోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
బండి సంజయ్ ప్రచారం..
హుస్నాబాద్ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. ఈసారి అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు అభ్యర్థుల కోసం ఆయన వేట ప్రారంభించారు. ఇదిలా ఉండగా బీజేపీలో వర్గాల కుంపటిపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వర్గపోరుకు స్వస్తి పలికి కార్యకర్తలను ఏకతాటిపై తేస్తేనే గానీ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న సీట్లను సాధించే అవకాశం ఉండకపోవచ్చని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
అగ్రనేతల ప్రచారం
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఏకై క హుస్నాబాద్ మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు హుస్నాబాద్‌లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ, మూడోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది.


