గులాబీ జెండా ఎగరాలి
● ప్రతి కార్యకర్త కష్టపడాలి ● హరీశ్‌రావు దిశానిర్దేశం ● బీఆర్‌ఎస్‌లో చేరిన రామాయంపేట కాంగ్రెస్ నేత
సిద్దిపేటజోన్/సిద్దిపేటరూరల్/సిద్దిపేటకమాన్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ నేత బాలు జొన్నల సోమవారం సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పిన హరీశ్.. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల గూర్చి దిశానిర్దేశం చేశారు. కాగా, స్థానిక 43 వార్డుకు చెందిన యశోధకు రూ.2,75 లక్షలు, చిన్నకోడూర్ మండల కేంద్రానికి చెందిన పూజకు రూ లక్ష విలువైన ఎల్‌ఓసి అందించారు. అదేవిధంగా వివిధ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ లు ఆవిష్కరించారు.
సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి తనిఖీ
ప్రభుత్వాసుపత్రిలో కేన్సర్ సేవలు మరింత మెరుగు పడాలని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఐసీయూ, కేన్సర్ విభాగాల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి రోజు అన్నం పెడుతున్నారా? సౌకర్యాలు మంచిగ ఉన్నాయా..? అని రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. చికిత్స కోసం వచ్చే రోగులకు మందులు బయటకు రాయొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ చందర్, సీఎస్‌ఆర్‌ఎంఓ జ్యోతి, ఆర్‌ఎంఓ సదానందం, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.
మెడికల్ సీటు సాధిస్తే ఫీజు నేనే భరిస్తా
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైద్య కళాశాలలో సీటు సాధిస్తే ఫీజులు తానే సొంతంగా భరిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని చింతమడక బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వచ్చే ఏడాదిలో సిద్దిపేట మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లను 280కి పెంచుతామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన వారికి సొంతంగా ఐ ప్యాడ్ కొనిస్తానన్నారు. కాగా, జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన 11 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మోత్కు లతా శంకర్, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.


