గెలుపు గుర్రాల కోసం వేట
సర్వే నిర్వహిస్తున్న పార్టీలు
● చాలా వార్డుల్లో పోటీ తీవ్రం ● తలనొప్పిగా మారిన టికెట్ల కేటాయింపు
దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడటంతో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. నేడే, రేపో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థుల హడావిడి ఎక్కువైంది. ఇప్పటికే దుబ్బాక మున్సిపల్‌లో ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడమే కాక, గెలుపు గుర్రాల ఎంపికకు జోరుగా సర్వేలు చేపడుతున్నాయి.
పార్టీల అధిష్టానాలకు తలనొప్పి
దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో పలు వార్డుల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సైతం పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌లోని 20 వార్డులున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఇబ్బందిగా తయారైంది. వార్డుల వారీగా ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్న ఆయన... గెలిచే వారికే టికెట్ ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారు. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి 82, కాంగ్రెస్ 67, బీజేపీ నుంచి 52 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
చైర్మన్ బీసీ మహిళ కావడంతోనే..
మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కావడంతో ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు జనరల్ స్థానాల్లో సైతం మహిళలనే పోటీకి దింపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యధిక వార్డులు గెలుచుకొని చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలున్నాయి. మంత్రి వివేక్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మున్సిపల్‌లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, క్యాడర్‌తో సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్‌లో తలనొప్పిగా తయారైన టికెట్ల కేటాయింపు ప్రధాన పార్టీలు ఎలా కేటాయిస్తాయో వేచి చూడాలి.


