ఓటు.. బ్రహ్మాస్త్రం
జిల్లాలో 9.94లక్షల మంది ఓటర్లు
● నూతనంగా పొందిన వారు 24వేల మంది ● నేడు జాతీయ ఓటరు దినోత్సవం
సాక్షి, సిద్దిపేట: ఓటు అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కోరుకున్న పాలనను తెచ్చుకోవచ్చు. మంచి నాయకులను ఎన్నుకోవచ్చు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలు చేపడుతున్నా 90శాతానికి పోలింగ్ చేరడం లేదు. గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ ఓటర్లే వెనుకంజ వేస్తున్నారు. జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం..
అసెంబ్లీలోనే ఎక్కువ
గత శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ నమోదును పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో 83.05 శాతం, లోక్‌సభ ఎన్నికల్లో 78.32శాతం, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.29శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అతివలే అధికం
జిల్లాలో అతివలే అధికంగా ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9,94,786 ఓటర్లున్నారు. అందులో పురుషులు 4,86,221, మహిళలు 5,08,480, ఇతరులు 85 మంది ఉన్నారు. వీరిలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారు 24,183 ఉండగా అందులో పురుషులు 14,267, మహిళలు 9,915, ఇతరులు ఒకరు ఉన్నారు.
కలెక్టర్‌కు అవార్డు
ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. అందులో ఉత్తమ ఎన్నికల సాధన అవార్డుకు కలెక్టర్ హైమావతి, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పని చేసిన గరీమా అగర్వాల్ (ప్రస్తుత సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్), బెస్ట్ బీఎల్‌ఓగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 185 పోలింగ్ స్టేషన్ బీఎల్‌ఓ పుష్పలత ఎంపికయ్యారు. వీరు ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
హుస్నాబాద్ 1,25,004 1,30,203 09 2,55216
సిద్దిపేట 1,19,001 1,24,226 70 2,43,297
దుబ్బాక 99,193 1,05,537 01 2,04,731
గజ్వేల్ 1,43,023 1,48,514 05 2,91,542


