బడిపాట్లు.. సర్కస్‌ ఫీట్లు | - | Sakshi
Sakshi News home page

బడిపాట్లు.. సర్కస్‌ ఫీట్లు

Jan 23 2026 11:06 AM | Updated on Jan 23 2026 11:06 AM

బడిపాట్లు.. సర్కస్‌ ఫీట్లు

బడిపాట్లు.. సర్కస్‌ ఫీట్లు

3 కిలోమీటర్లు నడవాల్సిందే..

బస్సులు లేక..

పాఠశాల విద్యార్థుల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన బస్సు సౌకర్యంలేక నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. అందరూ చదుకోవాలన్నది సర్కారు లక్ష్యం. కానీ అందుకు తగ్గ మౌలిక వసతులు లేక విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించాలంటే బాలబాలికలు నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే వీరి కష్టాలు రెట్టింపవుతుంటాయి. మరోవైపు నలుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 15 మంది చిన్నారులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు సైతం నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– సాక్షి, సిద్దిపేట

జిల్లా వ్యాప్తంగా దాదాపు 82 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలే దిక్కవుతున్నాయి. ఒకవేళ ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లే వేళ.. ఇంటికి వచ్చే సమయంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. 6 తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు కోవాలంటే నడక కష్టాలు తప్పడంలేదు. ఆటోల్లో నిత్యం 2,710 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండటం గమనార్హం. చాలా రూట్లలో రద్దీ తగ్గట్లు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డులపై ప్రమాదపు అంచున ప్రయాణించాల్సి వస్తోంది.

నిత్యం బడులకు

ఆటోల్లో:

2,560 మంది

టాటా మ్యాజిక్‌:

150 మంది విద్యార్థులు

నర్సింహుల పల్లె నుంచి ఆటోలో వెళ్తున్న విద్యార్థులు

ఆటోల్లో డ్రైవర్‌ సీటుకు అటు, ఇటు, లోపల ఖాళీ లేకుండా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ నిబంధనలు పాటించడంలేదు. ఏదైన ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే తల్లిదండ్రులు ముందే మేల్కొవాలి. స్కూల్‌ యాజమాన్యాలు, సిబ్బంది కూడా వారి స్కూళ్లకు ఎక్కువ మంది పిల్లలను తీసుకువచ్చే ఆటోలను అనుమతించకూడదు.

రోజూ కిలోమీటర్లమేర నడక

జిల్లాలో 82 గ్రామాలకు బస్సులే లేవు

చాలా చోట్ల ఆటోలే దిక్కు

ప్రమాదం అంచున ప్రయాణాలు

2,710 మంది విద్యార్థులు ఆటోల్లోనే స్కూళ్లకు..

వెలుగు చూసిన వాస్తవాలు

గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ పట్టణం సంగాపూర్‌ రోడ్డు మార్గంలో గల బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌ లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ హబ్‌లో 6 తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారుగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. గజ్వేల్‌ పట్టణం నుంచి దాదాపు 3 కిలో మీటర్లు ఉంటుంది. చాలా మంది ఆటోలలో వస్తుండగా ఆర్థిక స్తోమతలేని విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంకొందరు ఆ రోడ్డు మార్గం గుండా వచ్చే వాహనాల వారిని లిఫ్ట్‌ అడుగుతుంటారు. ఇలా ఇబ్బందులు పడు తూ పాఠశాలకు.. ఇంటికి చేరుకుంటున్నారు.

ఒకే ఆటోలో 15 మందికిపైగా..

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో వస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మహారాజ్‌ తండా, బంజారాహిల్స్‌ తండా, బొడిగెపల్లిలకు ఆటోలలో విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఒకరి మీద ఒకరు కూర్చుని ప్రయాణిస్తున్నారు.

బెజ్జంకి(సిద్దిపేట): నర్సింహుల పల్లె, వడ్లూరు, తలారివానిపల్లె గ్రామాలకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు లిఫ్ట్‌ అడగడం, లేక ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. కొందరు సైకిళ్లపై వెళ్లి వస్తున్నారు.

తప్పని నడక

మిరుదొడ్డి(దుబ్బాక): మోడల్‌ స్కూల్‌ విద్యార్థులను సాయంత్రం 4.15 గంటలకు బడి విడిచి పెడితే రాత్రి 7 గంటల వరకు బస్‌స్టాప్‌ వద్దనే పడి గాపులు కాయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సరికి రాత్రి 8 గంటలు దాటుతోందని వాపోతున్నారు. బరువున్న పుస్తకాల బ్యాగుతో నడక సాగించాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోజూ ఆటోలోనే..

గౌరవెల్లి స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాను. మాది బంజారాహిల్స్‌ తండా. తండాకు బస్సు లేకపోవడంతో రోజూ ఆటోలో వెళ్లి వస్తున్నా. ఉదయం, సాయంత్రం సమయాల్లో మా తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.

–నిరంజన్‌, 6వ తరగతి

అన్ని రూట్లలోనూ బస్సులు తిప్పుతాం

సిద్దిపేట, దుబ్బాక ఆర్టీసీ డిపో పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నాం. కరోనా వేళ రద్దయిన గ్రామాలకు విద్యార్థుల వినతి మేరకు బస్సులను తిప్పుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మరిన్ని అదనపు ట్రిప్పులు కూడా ఏర్పాటు చేస్తాం. – భవభూతి, ఆర్టీసీ డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement