వార్డులు పెరగకపాయే.. ఖర్చు పెరగవట్టే
బాబ్బాబు.. పోటీ చెయ్
● పార్టీల నాయకత్వంలోనూ టెన్షన్
● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నేతల పరిస్థితి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగకపోవడం ఆశావహులను టెన్షన్‌కు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో ఒక్కో వార్డులో 1400లోపు మాత్రమే ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 2400కుపైగా చేరుకుంది. ఫలితంగా ప్రచారానికి ఎక్కువగా శ్రమించాల్సిరావడం, ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్
మున్సిపాలిటీ పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలు విలీనమైన తర్వాత ఓటర్ల సంఖ్య 46,740కు చేరింది. ఇందులో మహిళలు 24,001 ఉండగా, పురుషులు 22,738మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. నిర్వాసిత గ్రామాలకు చెందిన ఓట్లే 14వేలపైచిలుకు ఓట్లు కొత్తగా కలిశాయి. దీని తర్వాత వార్డుల సంఖ్య 30కిచేరుకుంటాయని అంతా భావించారు. కానీ గతంలో ఉన్న 20వార్డుల్లోనే కొత్త ఓట్లు సర్దుబాటు చేసిన సంగతి తెల్సిందే. దీనివల్ల గత ఎన్నికల సందర్భంగా ఒక్కో వార్డులో 1,400 వరకు ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం ఈ సంఖ్య 2,400కుపైగా చేరుకున్నది. మరోవైపు వార్డుల పరిధి కూడా పెరిగింది. ఒక్కో వార్డును ఒక చోట కాకుండా, భౌగోళికంగా దూరంగా ఉన్నా కాలనీలను కలిపిన సంగతీ తెల్సిందే. దీనివల్ల బరిలో ఉండే అభ్యర్థులకు ప్రచారానికి శ్రమపెరిగే అవకాశం. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే ఖర్చు భారీగా పెరగనున్నది. దీనివల్ల ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.
నిర్వాసిత గ్రామాల్లో..
ఇకపోతే మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీలో మరో రకమైన పరిస్థితి నెలకొంది. తమకు కొత్తగా పది వార్డులు ఇస్తారనుకుంటే.. వార్డుల్లోనే తమను సర్దుబాటు చేశారనే నిరుత్సాహాంలో నిర్వాసితులు ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వారికి కేటాయించిన 7, 8, 9, 10, 11, 12వార్డుల్లో నిర్వాసిత గ్రా మాలకు చెందిన వారే పోటీలో ఉండాలని, స్థానికేతరులకు మద్దతు పలకవద్దని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితి వల్ల ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వీరి పాత్రే కీలకంగా మార నుంది.
కొన్ని వార్డుల్లో ప్రజల్లో పేరున్న ఆశావహులు సైతం ఓటర్ల సంఖ్య పెరగడం, ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో పోటీకి విముఖత చూపుతున్నారు. ఈ పరిస్థితి వల్ల ప్రధాన పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదు. ఫలితంగా ఆ పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. ఎవరికై తే వార్డుల్లో మంచి పేరు ఉండి గెలిచే అవకాశాలున్నాయో...వారి ఇళ్ల వద్దకు వెళ్లి పోటీచేయాలంటూ బతిమాలుతున్నారు. ఖర్చు సంగతి మేం చూసుకుంటామంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయకుల మాటలను నమ్మడం లేదు. పోటీ చేయడానికి వెనకంజ వేస్తున్నారు. ముందుగా డబ్బులు సర్దుబాటు చేస్తామని చెప్పి.. తర్వాత తమను ఆగం చేస్తారని భయపడుతున్నారు. ఈ పరిిస్థితి పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీల నాయకత్వం కూడా తలలు పట్టుకుంటున్నది. కొద్ది రోజుల తర్వాత మార్పులు ఏమైనా ఉంటాయా..? అనేది వేచి చూడాల్సిందే.


