అర్జీలపై నివేదిక ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై నివేదిక ఇవ్వండి

Aug 26 2025 8:30 AM | Updated on Aug 26 2025 8:30 AM

అర్జీలపై నివేదిక ఇవ్వండి

అర్జీలపై నివేదిక ఇవ్వండి

ప్రతీ వినతిని పరిష్కరించాలి

కలెక్టర్‌ హైమావతి

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణిలో ప్రజలు అందించిన ప్రతి అర్జీని త్వరగా పరిష్కరించాలని, అలాగే అర్జీలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 281 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, డీఆర్‌ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బందులు తొలగించండి

మాది బందారం గ్రామం. ఔటర్‌ రింగురోడ్డు నిర్మాణంలో భాగంగా గ్రామం మధ్యలో ఉన్న సీసీ రోడ్డును తొలగించారు. మళ్లీ రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వర్షాలకు పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఎలాగైనా అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని బందారం గ్రామస్తులు కోరారు.

డంపింగ్‌ యార్డును తొలగించాలి

మాది తొగుట మండలం, వరదరాజులపల్లి గ్రామం. సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన చెత్తను తీసుకువచ్చి గ్రామ శివారులో వేస్తున్నారు. దీంతో నీటితోపాటు భూమలు కలుషితం అవుతున్నాయి. అలాగే బయోఎరువులు, బయోగ్యాస్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను దిగువన ఉన్న కుంటలోకి వదులుతున్నారు. అందులోని చేపలు సైతం చనిపోతున్నాయి. ఇప్పటికై నా డంపింగ్‌ యార్డును తొలగించాలని వరదరాజుల పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

ఉపకరణాలు అందించాలి

జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలను అందించాలని స్వేచ్ఛ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అశోక్‌ మాట్లాడుతూ దివ్యాంగులు ఉపకరణాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కార్మికులకు ఇన్సూరెన్స్‌ చేయించండి

సిద్దిపేటరూరల్‌: పరిశ్రమల్లోని కార్మికులకు ఇన్సూరెన్స్‌ చేయించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని యువతకు ఉపాధి అందించడానికి పరిశ్రమల స్థాపన ఎంతో ముఖ్యమన్నారు. వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు పెట్టుకున్న వాటిని పరిశీలన చేయాలన్నారు. పరిశ్రమల శాఖ అధికారి గణేశ్‌రామ్‌, ఎల్‌డీఎం హరిబాబు, పాల్గొన్నారు.

ఇళ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లతో కలెక్టర్‌ జూమ్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్కింగ్‌ చేశాక బేస్‌మెంట్‌ వరకు నిర్మాణం కాని వారి వివరాలను తీసుకురావాలన్నారు. బేస్‌మెంట్‌ వరకు అయిన వాటిని ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన యాప్‌లో నమోదు చేసేలా పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్‌ ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement