
అసెంబ్లీని ముట్టడిస్తాం
చేర్యాలను డివిజన్ చేయాల్సిందే
● సాధన సమితి జేఏసీ చైర్మన్‌నరసయ్య పంతులు ● అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
కొండపాక(గజ్వేల్): చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సాధన సమితి జేఏసీ చైర్మన్ వకులాభరణం నరసయ్య పంతులు హెచ్చరించారు. మండల పరిధిలోని వెలికట్ట శివారులో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజానీకం వివిధ సమస్యల పరిష్కారం కోసం హుస్నాబాద్, గజ్వేల్, సిద్దిపేట, జనగామ తదితర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో దూరభారంతోపాటు ఆర్థిక భారం తప్పడంలేదన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. అయినా పాలకులు స్పందించడంలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. రహదారిపై సుమారు 25 నిమిషాల పాటు రాస్తారోకో కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆముదాల మల్లారెడ్డి, బాల్‌నర్సయ్య, యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, సంతోష్, రవీందర్, పద్మ, శోభ, మానస, మల్లేశం, కర్ణాకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.