
యూరియా కోసం అలసి.. సొలసి
యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రాత్రనక పగలనకా పడిగాపులు పడుతున్నారు. మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అలసి సొలసిన కొందరు అక్కడే కునుకు తీశారు. తీరా యూరియా రావడం లేదని తెలియడంతో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో రోడ్డుపై బైఠాయించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రెండు యూరియా లారీలను తెప్పించి పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనవిరమించారు. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. మద్దూరు మండలం రేబర్తి సొసైటీ వద్ద జరిగిన యూరియా పంపిణీలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల పహారాలో అందించారు. చిన్నకోడూరు, బెజ్జంకి, చేర్యాల, కొండపాక తదితర మండలాల్లోనూ ఇదే దుస్థితి.
– మిరుదొడ్డి(దుబ్బాక)/ మద్దూరు(హుస్నాబాద్)/ చిన్నకోడూరు/బెజ్జంకి/చేర్యాల(సిద్దిపేట):
రెండు రోజులుగా జ్వరం..అయినా..
సంచి యూరియా కోసం నాలుగు రోజుల నుంచి తిప్పలు పడుతున్నా. అయినా దొరకడంలేదు. నాకు బీపీ, షుగర్ ఉంది. పైగా రెండు రోజులుగా జ్వరం. గంటల కొద్దీ నిరీక్షించడంలో పానం ఆగమవుతోంది. జర యూరియా అందించి పుణ్యం కట్టుకోండి.
– కనకవ్వ, మహిళా రైతు, అందె, మిరుదొడ్డి

యూరియా కోసం అలసి.. సొలసి